కుప్పంలో

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కొన్ని ద‌శాబ్దాలుగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస‌గా అక్క‌డినుంచి ఏడుసార్లు విజ‌యం సాధించారు. మ‌రోసారి విజ‌యం సాధించ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబును కుప్పంలో నిలువ‌రించ‌గ‌లిగితే ఆ పార్టీని రాష్ట్ర‌వ్యాప్తంగా నిల‌వ‌రించ‌వ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 151 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నా వాటిల్లో కుప్పం, హిందూపురం లాంటివి లేవు.

1989 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీచేసిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడి నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఎలాగైనా చంద్రబాబును ఇక్కడ ఓడించగలిగితే అధికారం సాధ్యపడుతుందని జగన్ భావిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపొంది రెండోసారి అధికారంలోకి రావాల‌నుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తొలి వ్యూహంగా కుప్పంను ఎంచుకుంది. తాను ‘ఓదార్పు’ యాత్ర చేసే స‌మ‌యంలో కూడా వెళ్ల‌ని కుప్పానికి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లారు.

రూ.66 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. కుప్పంలో చంద్ర‌బాబు ఎటువంటి అభివృద్ధి చేయ‌లేద‌న్నారు. 33 సంవ‌త్స‌రాలుగా కుప్పం నుంచి బాబు చాలా తీసుకున్నార‌ని, అవ‌న్నీ తిరిగిచ్చేయాలంటూ జగన్ బీసీ మంత్రాన్ని ప‌ఠించారు. ఎమ్మెల్సీ భ‌ర‌త్ కూడా బీసీనే. ఒకరకంగా బీసీ వ్యూహాన్ని ప్రయోగించారని, బీసీల్లో ఇది మన సీటు అనే భావను కల్పించడంద్వారా టీడీపీకి ఓటుబ్యాంకుగా ఉన్న బీసీలందరినీ వైసీపీవైపు మళ్లించాలనే వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా నూట్రల్ ఓటర్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. వారిని అభివృద్ధి పనులద్వారా ఆకట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే రూ.66 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 45 సంవత్సరాల వయసు దాటిన మహిళలను ఆకట్టుకోవడానికి ‘చేయూత’ పథకాన్ని అక్కడినుంచే ప్రారంభించారు. వృద్ధులను ఆకట్టుకోవడానికి జనవరి నుంచి పింఛను పెంపును ప్రకటించారు. యువతరం ఓట్లను దక్కించుకోవడానికి ఎమ్మెల్సీ భరత్ యువనేత కాబట్టి లెక్క సరిపోతుందనే అంచనాకు వచ్చారు.

ఇటీవ‌లే జ‌రిగిన చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న తీవ్ర ఉద్రిక్త‌ల‌కు దారితీసింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న 60 మంది టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు వీరికి తాజాగా బెయిల్ ఇచ్చింది. తమకు సంబంధంలేని కేసులు పెట్టారని వీరు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వీరంతా పట్టుదలగా పనిచేసి చంద్రబాబును గెలిపించడానికి ప్రయత్నిస్తారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించి భరత్ విజయం సాధిస్తారా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.!!