కుప్పంలో చంద్రబాబుకు షాక్-కొత్త అస్త్రాలు బయటికి తీసిన జగన్-ఇతర సీట్లలోనూ ప్రభావం ?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి తొలి అడుగుగా సీఎం జగన్ భావిస్తున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ ఆయన పర్యటించారు. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తున్న జగన్.. పలు సంక్షేమ పథకాలకు శంఖుస్ధాపనలు చేశారు. అనంతరం కుప్పంలో స్ధానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు చంద్రబాబును ఓడించేందుకు తన వద్ద ఉన్న రెండు అస్త్రాల్నిసైతం బయటికి తీసారు. అయితే ఆ రెండు అస్త్రాలు కుప్పంలో వైసీపీని గెలిపిస్తాయో లేదో తెలియదు కానీ మిగతా నియోజకవర్గాలపై మాత్రం ప్రభావం చూపబోతున్నాయి.

ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కంట్లో నలుసుగా మారిన స్ధానిక ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబును ఇక్కడ ఎలాగైనా ఓడించేందుకు కొత్త అస్త్రాల్ని సైతం బయటికి తీశారు. ఇందులో ఒకటి బీసీ కార్డు కాగా.. మరొకటి లోకల్ కార్డు. ఈ రెండు కార్డుల్ని కొత్తగా కుప్పంలో పరిచయం చేసిన జగన్.. చంద్రబాబును ఓడించేందుకు వీటిని వాడుకోవాలని స్ధానిక వైసీపీ నేతలకు సంకేతాలు ఇచ్చేశారు. తద్వారా ఈ రెండు అస్త్రాలతోనే చంద్రబాబును ఓడించగలమన్న నమ్మకాన్ని వైసీపీ నేతల్లో నింపారు. దీంతో ఈ రెండు అస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కుప్పంలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు బీసీ కార్డుని బయటికి తీశారు. కుప్పంలో జనాభాపరంగా బీసీలు ఎక్కువగా ఉన్నారని, ఇది చంద్రబాబు నియోజకవర్గం కాదని, బీసీ నియోజకవర్గమని జగన్ తేల్చేశారు. తద్వారా బీసీలకే ఇక్కడ ఓటు వేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అలాగే లోకల్ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. కుప్పంలో స్ధానికుడు కాని చంద్రబాబును వరుసగా గెలిపిస్తున్న ఓటర్ల మనసుల్లో లోకల్ కాని చంద్రబాబుకు బదులుగా లోకల్ అయిన భరత్ ను గెలిపించాలనే భావనను తెచ్చేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో జగన్ ప్రయోగించిన ఈ రెండు అస్త్రాలపై వైసీపీతో పాటు టీడీపీలోనూ చర్చ మొదలైంది.

వరుసగా ఏడుసార్లు చంద్రబాబును గెలిపించిన కుప్పం ప్రజల్లో ఆయన్ను పలచన చేయడం అంత సులువు కాదు. అవినీతి ఆరోపణలు చేయడం కూడా కష్టమే. అభివృద్ధి పేరుతో ఏదైనా చేద్దామన్నా గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితోనే వారు ఓట్లు వేస్తున్నారు. దీంతో జగన్ వైసీపీ అభ్యర్ధిని కుప్పంలో గెలిపించుకునేందుకు కొత్త అస్త్రాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా బీసీ, లోకల్ కార్డుల్ని బయటికి తీశారు. అయితే ఈ రెండు అంశాలు స్ధానిక ఓటర్లకు తెలియనివి కాదు. ఇప్పటికే బీసీల అండతోనే చంద్రబాబు అక్కడ గెలుస్తున్నారు. అలాగే లోకల్ కాకపోయినా అక్కడ టీడీపీ నేతల్ని మోహరించి ఆ లోటు లేకుండా చూసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. అందుకే గత ఎన్నికల్లో సైతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా కుప్పంలో మాత్రం చంద్రబాబే గెలిచారు.

ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ప్రయోగించిన రెండు కీలక అస్త్రాలు వైసీపీకి మిగతా నియోజకవర్గాల్లో ఎదురుతన్నే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా స్ధానికంగా మెజార్టీ జనాభా ఆధారంగానే టికెట్లు కేటాయించాలన్న సందేశాన్ని జగన్ ఇవాళ తన ప్రసంగంలో చెప్పారు. అలాగే స్ధానికులకే టికెట్లు ఇవ్వాలన్న, గెలిపించాలన్న సంకేతాన్ని కూడా పంపారు. ఈ రెండు విషయాల్ని రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తమ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులుగా గెలుస్తున్న మిగతా కులాల వారికి, స్ధానికేతరులకు జనం వర్తింపజేస్తే అప్పుడు బ్యాక్ ఫైర్ కావడం ఖాయం. మరి ఈ విషయం ఆలోచించే జగన్ కుప్పంలో ఈ రెండు కార్డుల్ని బయటికి తీశారా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.