ఐరాసలో పాకిస్తాన్ కు భారత్ దీటైన జవాబు-ఇస్లామోఫోబియా అసంబద్ధం-ఇక్కడ ముస్లింలు సేఫ్..

ఐరాసలో భారత్ ను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్‌తో శాంతి కోసం పాకిస్థాన్ చూస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి, స్థిరత్వం కాశ్మీర్ సమస్య పరిష్కారంపై ఆధారపడి ఉందని పాక్ ప్రధాని షరీఫ్ అన్నారు. సెప్టెంబరు 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రసంగంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఈ ఆరోపణల్ని భారత్ తిప్పికొట్టింది. భారతదేశంపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరం అని పేర్కొంది.

ఐరాస సాధారణ సభలో నిన్నటి ప్రసంగాల తర్వాత ‘రైట్ ఆఫ్ రిప్లై’ సెషన్‌లో భారత దౌత్యవేత్త, ఫస్ట్ సెక్రటరీ మిజితో వినిటో మాట్లాడుతూ “తన స్వదేశంలో పరిణామాల్ని మరుగుపరచడానికి, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచ ఆమోదయోగ్యం లేని చర్యలను సమర్థించడానికి షరీఫ్ అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. “తన పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే రాజకీయాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎప్పటికీ స్పాన్సర్ చేయవని భారత్ ప్రతినిధి వినిటో తెలిపారు. అది అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో మాత్రమే ఉనికిని బహిర్గతం చేస్తూ భయంకరమైన ముంబై వంటి ఉగ్రవాద దాడికి ఆశ్రయమివ్వదన్నారు. అటువంటి దేశం పొరుగువారిపై అన్యాయమైన, సమర్థించలేని ప్రాంతీయ వాదనలు చేయలేదన్నారు.

చట్టవిరుద్ధమైన జనాభా మార్పుల ద్వారా ముస్లిం మెజారిటీ జమ్మూ, కాశ్మీర్‌ను హిందూ భూభాగంగా మార్చాలని భారతదేశం ప్రయత్నిస్తోందని షరీఫ్ నిన్న ఐరాసలో ఆరోపించారు. భారతదేశం కాశ్మీరీల నుండి భూమిని స్వాధీనం చేసుకుంటుందని, జెర్రీమాండరింగ్, తప్పుడు ఓటర్లను నమోదు వంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇస్లామోఫోబియాలో ఇదో భాగమన్నారు.

దీనిపై స్పందించిన భారత దౌత్యవేత్త వినిటో..షరీఫ్ వ్యాఖ్యలు భారతదేశంలోని 200 మిలియన్లకు పైగా ముస్లింలపై అధికారికంగా ప్రాయోజిత అణచివేత ప్రచారం చేసేలా ఉన్నాయన్నారు. దీనికి ఇస్లామోఫోబియా ముసుగు తొడగడం దురదృష్టకరమన్నారు. వారు వివక్షాపూరిత చట్టాలు, విధానాలు, హిజాబ్ నిషేధాలు, మసీదులపై దాడులు, హిందూ గుంపుల దాడికి గురవుతున్నారన్నారని షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కొంతమంది తీవ్రవాదులు భారతదేశంలోని ముస్లింలపై మారణహోమం కోసం పిలుపునిచ్చినందుకు తాను ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నట్లు వినిటో తెలిపారు.