ఎన్టీఆర్ పేరు మార్పు పై బాలకృష్ణ సీరియస్ – ఆయన బిక్షతో ఆ నేతలు అక్కడ..!!

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు మార్పు అంశం పైన నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఇప్పటికే ఈ అంశం పైన నందమూరి కుటుంబం తరపున రామకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలంతా పేరు మార్పు నిర్ణయాన్ని తప్పు బట్టారు. నిరసనలు చేసారు. అటు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ తన నిర్ణయానికి వెనుక కారణాలను వివరించారు. ఎన్టీఆర్ పైన తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. అటు బీజేపీ తో సహా ప్రతిపక్షాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించాయి.

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరి పేరో తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రేపు వేరే వాళ్లు వచ్చి వైఎస్సార్ పేరు తీసేస్తే అది అవమానం కాదా అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ బ్యాలెన్స్ గా రియాక్ట్ అయ్యారు.

వైఎస్సార్ – ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగు ప్రజలు మెచ్చిన నేతలుగా చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఈ పేరు మార్పు వ్యవహారం పైన సీరియస్ వ్యాఖ్యలు చేసారు. మార్చేయటానికి..తీసేయటానికి ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని సంస్కృతి..ఓ నాగరికత..తెలుగు జాతి వెన్నుముకగా అభివర్ణించారు. తండ్రి గద్దెనెక్కి ఏయిర్ పోర్టు పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలున్నాయి..తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిచారు.

అక్కడ ఆ మహానీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులంటూ బాలయ్య తన సోషల్ మీడియా పోస్ట్ లో ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం ఈ విషయం పైన వివరణ ఇస్తూనే..అదే సమయంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది.

పేరు మార్పుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఒక సూచన చేసారు. టీడీపీ హయాంలో చేసిన నిర్మాణాలు ఏవైనా ఉంటే వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టటానికి అభ్యంతరం లేదని, ఆ వివరాలతో రావాలని సూచించారు. దీనికి ప్రతిగా జగన్ హయాంలో ఏవైనా నిర్మిస్తే వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవాలని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

ఇటు ఎన్టీఆర్ పేరు మార్పును నిరిసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పేరు మార్పు నిర్ణయం మార్చుకోవాలని కోరారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యక్షంగా – పరోక్షంగా ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిన విషయం పైన చర్చ మొదలైంది. ఈ వ్యవహారం పైన నందమూరి లక్ష్మీ పార్వతి ఇప్పటి వరకు స్పందించలేదు, ఇక, బాలయ్య సీరియస్ గా చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.