ఎన్టీఆర్ పేరు మార్పుపై షర్మిల సంచలనం – అవమానించటమే..!!

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ఒక సారి షర్మిల స్పందించారు. పేర్లు మార్చుకుంటూ పోతే వారికి సరైన గుర్తింపు దక్కదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పేర్ల విషయంలో అయోమయం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పుుడ మరోసారి స్పందించిన షర్మిల ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనంటూ సంచలనానికి కారణమయ్యారు.

ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా అంటూ నిలదీసారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ప్రతిపక్ష పార్టీలు అధికార వైసీపీనీ టార్గెట్ చేస్తున్నాయి, అసెంబ్లీ వేదికగా ఈ పేరు మార్చటం వెనుక కారణాలను వివరించారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సంస్కరణలు తీసుకొచ్చి అనేక మంది పేదలకు వైద్యం ఉచితంగా అందించారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

ఆయన స్పూర్తిగా తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నామని, ఇవన్నీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ పైన తనకు గౌరవం ఉందని సీఎం వివరించారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ అటు ఎన్టీఆర్ – ఇటు వైఎస్సార్ ఇద్దరూ పాపులర్ లీడర్లుగా అభివర్ణించారు. అయితే, ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పైన షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.