ఆ రూ.2.50లక్షల కోట్లకు లెక్క చెప్పరే.. కేసీఆర్ వైఫల్యాలను, అవినీతిని టార్గెట్ చేస్తున్న కేంద్రమంత్రులు!!

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం లో భాగంగా పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై, ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగాశేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ప్రహ్లాద్ జోషి తెలంగాణ ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు. కెసిఆర్ కు ఆయన కుటుంబమే తెలంగాణా అని, అందుకే ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన, తన ఇంట్లోనే అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధికి గాను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్లు విడుదల చేసినా సీఎం తన సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని, భూ సేకరణ వంటి కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని ప్రహ్లాద్ జోషి నిప్పులు చెరిగారు.

బంగారు పళ్లెంలో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న మంత్రి కేటీఆర్ కు నిరుపేదల కష్టాలు ఏం తెలుసు అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 2.50 లక్షల కోట్లకు సంబంధించిన లెక్క అడిగితే చెప్పడం లేదని కాగ్ నివేదిక ఇచ్చిందని, సీఎం కేసీఆర్ ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయో చెప్పాలంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. 2022 కల్లా దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలు అందరికీ పక్కా ఇళ్లు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సాధ్యం కాలేదని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

హైదరాబాద్ బీజాపూర్ రహదారికి కేంద్రం 2017లో 928 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్న ప్రహ్లాద్ జోషి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం 31 వేల కోట్లను విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కాలేదని ఆయన తెలిపారు.

ఇక ఇదే సమయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న కేంద్ర మంత్రి బిఎల్ వర్మ తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, మరియు సహకార శాఖ సహాయ మంత్రి బీ ఎల్ వర్మ తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ శ్రేణులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పబోతున్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజల కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల అమలులో ఫెయిల్ అయిందని ఆరోపించారు.

హన్మకొండలోని వడ్డేపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బీఎల్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడానికి బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ మహేశ్వరి గార్డెన్స్ లో వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించిన బీఎల్ వర్మ పీఎం స్వనిధి పథకం గురించి వారితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గూండాగిరి పెరిగిపోయిందని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గుండా రాజకీయాలను అంతం చేస్తామని బి ఎల్ వర్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రులు తమదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు.