ఆత్మీయంగా.. మునుగోడు ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్న టీఆర్ఎస్; రాజకీయం మామూలుగా లేదుగా!!

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకాలం లేని ప్రేమను ఓటర్లపై ఒలకబోస్తూ ఉన్నాయి. ఇక ఓటర్లపై ప్రేమను ఒలకబోస్తూ, వారిని ఆకర్షించే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీల కంటే టీఆర్ఎస్ ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన ప్లాన్ తో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు నిర్వహిస్తూ మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

త్వరలో ఉపఎన్నిక జరగనున్న మునుగోడులో ప్రచారంలో బిజెపి రాజకీయాలకు టిఆర్‌ఎస్ విరుగుడుగా ప్రేమ రాజకీయం ఎంచుకుంది. టీఆర్‌ఎస్ నాయకులు వినోదం, ఎన్నికల ప్రచారాన్ని కలగలిపి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చిత్ర విచిత్రమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలతో మునుగోడులో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. మునుగోడు లో రాజకీయ పార్టీల నాయకులు కొందరు జనాలను అలరించటం కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

చౌటుప్పల్ లో టీఆర్ఎస్ కార్యకర్తల జోష్.#TelanganaWithKCR #MunugodeWithTRS trspartyonline KTRTRS jagadishTRS pic.twitter.com/NQPzFax7hI

ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రజలకు కావాల్సిన వినోద, ఉల్లాస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, విందులు, వినోదాలతో ప్రజా మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి తమ మాటల చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలుగా వనభోజనాలను నిర్వహిస్తూ వారు ఓటర్ల మద్దతును పొందేందుకు ప్రముఖ టాలీవుడ్ పాటల ట్యూన్‌లకు రాజకీయ సందేశాలతో కూడిన రీమిక్స్‌లను చేసి వాటితో ఎంటర్టైన్ చేస్తున్నారు.

టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సరదాగా చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్షాలకు వేసిన సెటైర్ లను ప్రదర్శిస్తూ ఆత్మీయ సమ్మేళనాలకు వచ్చిన వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలలో అదరగొడుతున్నారు.

తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తన డాన్స్ తో అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా, కర్రసాము చేసి స్థానికుల దృష్టిని ఆకట్టుకున్నారు. నేను మీలో ఒకడిని అని చెప్పే ప్రయత్నం చేశారు.

రాజకీయ మీటింగ్ అంటే ప్రజలు ఆసక్తి చూపరని, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రేమపూర్వకంగా ప్రజల మనసును గెలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎమ్మెల్యేల తీరు కనిపిస్తుంది. రాజకీయ సమావేశం అంటే రానివారు ఆత్మీయ సమ్మేళనం అంటే వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానిని టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది.

ఇక ఇటీవల నారాయణపురం మండలంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, భోంగిర్‌ శాసనసభ్యురాలు గొంగిడి సునీత, ఎంపీపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఆత్మీయ సమ్మేళనం లో డ్యాన్స్‌లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అక్కడి ఓటర్లను ఉర్రూతలూగించారు.

ఏది ఏమైనా ఒక కొత్త స్ట్రాటజీ తో, ప్రేమతో సాధిస్తామంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు యుద్ధక్షేత్రంలో విజయం సాధిస్తారా? లేదా? అనేది పక్కనపెడితే, ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల తీరు మాత్రం స్థానికంగా ఉన్న ప్రజలకు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతల తీరుపై స్థానికంగా చర్చ జరుగుతుంది.