అజారుద్దీన్ పై సొంత పార్టీ నేతల ఫైర్ – ప్రభుత్వంతో మిలాకత్ : బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ..!!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసారు. ఆదివారం హైదరాబాద్ కేంద్రంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి టకెట్ల కేటాయింపు..నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. దీంతో..ఈ మ్యాచ్ నిర్వహణలో వస్తున్న ఆరోపణలు.. వైఫల్యాలతో ప్రభుత్వం – హెచ్సీఏ కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం – హెచ్ సీఏ మిలాకత్ అయ్యారని విమర్శించారు. అజాహరుద్దీన్ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీకి అనుగుణంగా 32 వేల టికెట్ లు మార్కెట్ లో పెట్టాల్సి ఉందన్నారు. కానీ, ఎన్ని టికెట్ లు ఇలా అందుబాటులో ఉంచారనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం టికెట్లు జారీ చేసారా లేదా చెప్పాలన్నారు. మంత్రులు కేటీఆర్ – శ్రీనివాస గౌడ్ ఇళ్లకు ఎన్ని టికెట్లు వెళ్లాయో చెప్పాలన్నారు. అధికార పార్టీ ఎంపీలు – ఎమ్మెల్యేలకు ఎన్ని టికెట్లు ఇచ్చారో బయట పెట్టాలని డిమాండ్ చేసారు. అజారుద్దీన్ కు స్పష్టత లేదని, ఆయన ఏం చెబుతున్నారో.. ఏం చేస్తున్నారో అర్దం కావటం లేదని వ్యాఖ్యానించారు.

ఈ మొత్తం వ్యవహారం పైన సమగ్ర విచారణ జరిపించాలని మహేష్ గౌడ్ కోరారు. ఇప్పటికే మ్యాచ్ సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. టికెట్ల వ్యవహారంలో తమ తప్పు లేదని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. అయితే, స్టేడియంలో ఏర్పాట్ల పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సాయంత్రం భారత్ – ఆసీస్ రెండు జట్ల ప్లేయర్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు ఉప్పల్ స్టేడియం లో టీ 20 మ్యాచ్ జరగనుంది. అదివారం..అందునా కీలక మ్యాచ్ కావటంతో క్రికెట్ అభిమానులంతా హైదరాబాద్ వైపే చూస్తున్నారు.