అజారుద్దీన్ కు కొమ్ము కాస్తున్నారా?? వివాదాస్పదంగా మంత్రి తీరు?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కోసం సాగిన టికెట్ల అమ్మకాలు హైదరాబాద్ పరువును గంగలో కలిపాయి. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 20 మంది ప్రేక్షుకులు, 10 మంది పోలీసులు గాయపడ్డారు. కొందరికి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సనందించారు. 29,500 టికెట్లకు కేవలం 2000 టికెట్లు అమ్మారు. మిగతా టికెట్లు ఏమయ్యాయనేది అజారుద్దీన్ కు, ప్రభుత్వానికే తెలియాలి.

తొక్కిసలాట జరగడంతో హడావిడిగా రవీంద్రభారతిలో సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ సమావేశానికి ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై, అజారుద్దీన్ పై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపించారు. హైదరాబాద్ పరువు తీశారని, స్టేడియం ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకొని అవసరమైతే ప్రభుత్వమే స్టేడియంను నిర్వహిస్తుందని ప్రకటించారు. ఆ సమయంలో మంత్రి ప్రకటనతో క్రికెట్ అభిమానులంతా ఆనందపడ్డారు. అవినీతి కంపులో నిండా మునిగిన హెచ్ సీఏపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించారు.

తీరా ఆ సమావేశం జరిగిన తర్వాత మంత్రి మాట్లాడిన తీరు చూస్తే అజార్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోదని అందరికీ స్పష్టమైంది. సిబ్బంది అందుబాటులో లేకపోవడంవల్ల హెచ్ సీఏ నిస్సహాయత వ్యక్తం చేసిందని, ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చివుంటే సహకరించేదని మాట్లాడారు. వారి దగ్గర సిబ్బంది లేకుండానే టికెట్ల అమ్మకాలు నిర్వహించారా? వారి దగ్గర సిబ్బంది లేకుండా పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చారా? వారి దగ్గర సిబ్బంది లేకపోతే అజారుద్దీన్ ఒక్కరే టికెట్ల అమ్మకాలు సాగించారా? అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.

మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి హెచ్ సీఏ స్పందించలేదు. అప్పటికే ప్రభుత్వం రెండుసార్లు నిలదీయడంతో తూతూ మంత్రంగా అమ్మకాలు సాగించామని చెప్పుకోవడానికే ఇలా చేసినట్లుగా ఉందంటున్నారు. ఆన్ లైన్ లో ఎన్ని టికెట్ల అమ్మకాలు జరిగాయి? ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్ల అమ్మకాలు జరిగాయి? అనే విషయమై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిస్తామని అజార్ ప్రకటించారు. గాయాలపాలైనవారి ఆస్పత్రి ఖర్చులను హెచ్ సీఏ భరిస్తుందని ప్రకటించారు. మతంకన్నా, కులంకన్నా ప్రాణంగా క్రికెట్ ను ప్రేమించే భారత్ లో అభిమానులతో ఆటలాడుకునేవారు ఎప్పుడూ ఉంటారని మరోసారి ఈ సంఘటన నిరూపించింది. మరి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!!