Ponniyin Selvan-1: ఐశ్యర్యా రాయ్, త్రిషకు మణిరత్నం వార్నింగ్.. అలా చేయొద్దని ఫైర్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్. పార్ట్ 1గా వస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి వంటి తదితర అగ్ర తారలు నటించారు. వారిలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, త్రిష ఉన్న విషయం తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్, టీజర్ ఎలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది హీరోయిన్ త్రిష. మరి అదెంటో ఓ లుక్కేద్దామా!

కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. చారిత్రాత్మక చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం సెప్టెంబర్ 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగానే సెప్టెంబర్ 23న అంటే ఇవాళ హైదరాబాద్ లోని జేఆర్సీకన్వనేషన్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ తారలు డిజిటల్, శాటిలైట్ ఛానెల్స్ కు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఛానెల్ కు త్రిష ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పొన్నియన్ సెల్వన్ సినిమా చిత్రీకరణ ఎంతో సరదాగా సాగిందని, ఐశ్వర్య రాయ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అంతేకాకుండా ఐశ్వర్య రాయ్ అందంగా ఉండటమే కాకుండా, తన మనసు కూడా అంతే అందమైనది అని చెప్పుకొచ్చింది త్రిష. కానీ ఈ సినిమాలో మాత్రం బద్ద వ్యతిరేకులుగా కనిపిస్తారట.

వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల క్యారెక్టర్లను తీర్చిదిద్దారట. అయితే త్రిష, ఐశ్వర్య రాయ్ మాత్రం సెట్స్ లో సరదాగా తిరిగేవారట. కలిసి సెల్ఫీలు తీసుకునేవారట. దీంతో మణిరత్నం ఇద్దరికి క్లాస్ తీసుకున్నాడని చెప్పింది త్రిష. వాళ్లిద్దరిని సెట్స్ లో కలిసి తిరగకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఎందుకంటే సినిమాలో త్రిష, ఐశ్వర్య రాయ్ ఒకరంటే ఒకరికి పడని పాత్రలు చేస్తున్నారు.

సినిమాలో వారి పాత్రల మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు చాలా సీరియస్ గా ఉండాలి. కానీ అలా సీరియస్ గా వాళ్లు యాక్టింగ్ చేయలేకపోయారట. అందుకే సినిమా చిత్రీకరణలో త్రిష, ఐశ్వర్య రాయ్ ఇద్దరిని కలవకూడదని గట్టి వార్నింగ్ ఇచ్చాడట డైరెక్టర్ మణిరత్నం. ఇక ఆ వార్నింగ్ తో ఐశ్వర్య రాయ్ తో కాస్త దూరం మెయింటేన్ చేసినట్లు త్రిష చెప్పుకొచ్చింది. ఐశ్వర్య రాయ్ హిందీ నటి అయినప్పటికీ తమిళం చక్కగా మాట్లాడుతుందని ప్రశంసలు కురిపించింది త్రిష.

ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుందని సమాచారం. ఒకటి నెగెటివ్ షేడ్స్ తో ఉండనుందట. త్రిష ఆసక్తికరమైన ఇళయ పిరట్టి కుందవై దేవి పాత్రలో అలరించనుంది. చోళ రాజకుమారులుగా.. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, శోభిత ధూళిపాళ నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంత పెద్ద తారాగణంతో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మాములుగా లేవు.