FakeChat: డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?-బీబీసీ పరిశోధన

అమెరికాకు చెందిన 50ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌లో తనను ఆకర్షించిన ఓ అందమైన యువతితో మాట్లాడుతున్నారు. ఆమె పేరు జింజర్‌హనీ. ఆమె ఒక శ్వేతజాతి మోడల్. తన ప్రొఫైల్‌ ఫోటోలో ఆమె బెడ్‌పై పడుకొని కనిపిస్తున్నారు.

ఆమె తనకు సమీపంలోనే ఉందని ఆయన అనుకుంటున్నారు. అయితే, జింజర్‌హనీ మహిళ కాదని, పురుషుడని, ఎక్కడో నైజీరియా నుంచి తనతో చాట్‌ చేస్తున్నాడని ఆ 50 ఏళ్ల వ్యక్తికి తెలియదు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పురుషులు ఇలానే వందల డాలర్లు చెల్లించి ”పెద్దలకు మాత్రమే’’ వెబ్‌సైట్లలో సెక్స్ చాట్‌లు చేస్తున్నారు. తాము మాట్లాడుతోంది అందమైన అమ్మాయిలతోనని వారు భావిస్తున్నారని, అయితే, అది అబ్బాయి కూడా కావొచ్చని బీబీసీ పరిశోధనలో తేలింది.

అమెరికాతో మొదలుపెట్టి నెదర్లాండ్స్ వరకు, సురీనామ్ నుంచి నైజీరియా వరకు ఈ ఫేక్ ప్రొఫైల్స్ వెనుక ఎవరున్నారో నెలలపాటు బీబీసీ పరిశోధించింది.

నెదర్లాండ్స్‌కు చెందిన ”మెటియోర్ ఇంటెరాక్టివ్ బీవీ’’ సంస్థకు చెందిన డేటింగ్ వెబ్‌సైట్లపై నకిలీ ప్రొఫైల్స్ నడిపిస్తున్న వారిలో నైజీరియా యూనివర్సిటీ విద్యార్థి అబియోదున్ (అతడి పేరు మార్చాం) ఒకరు.

డజన్ల కొద్దీ ఫేక్ అకౌంట్లను అబియోదున్ నడిపిస్తుంటారు. అన్ని ప్రొఫైల్స్‌లోనూ ఆయన అందమైన తెల్లజాతీ అమ్మాయిల ఫొటోలు పెడుతుంటారు.

ఒక సైట్‌లో ఆయన 21ఏళ్ల మోడల్ జింజర్‌హనీగా అవతారమెత్తారు. మంచంపై పడుకొని నడుం వరకు దుప్పటి కప్పుకున్న అమ్మాయి ఫోటోను ఆయన ప్రొఫైల్‌లో పెట్టారు.

అబియోదున్ కంప్యూటర్‌లో జింజర్‌హనీకి చెందిన అశ్లీల చిత్రాలు చాలా ఉన్నాయి. ఒకవేళ వేరే ఫొటో ఇవ్వాలని అడిగినా పంపించేలా ఒక ఫోల్డర్‌ను ఆయన సిద్ధం చేసుకున్నారు. ఈ ఫోటోలను వివిధ సైట్ల నుంచి ఆయన సేకరించారు.

అయితే, జింజర్‌హనీ ప్రొఫైల్ నడిపిస్తున్నది అబియోదున్ ఒక్కరేకాదు. డజన్ల మందికి ఈ ప్రొఫైల్ యాక్సెస్ ఉంది. వీరంతా షిఫ్టుల వారీగా ఆ ప్రొఫైల్‌ ద్వారా పురుషులకు ఎర వేస్తున్నారు.

అధునాత మ్యాప్ టూల్స్ సాయంతో జింజర్‌హనీ లొకేషన్‌ను చాట్‌చేసే వ్యక్తికి 50 కి.మీ. పరిధిలో ఉండేలా అబియోదున్, ఆయన సహచరులు మార్చేస్తున్నారు. నిజానికి ఈ లొకేషన్ వల్లే మొదటగా డేటింగ్ సైట్లలో వీరికి మ్యాచ్ కుదురుతోంది.

ఈ చాట్ కోసం సదరు 50 ఏళ్ల వ్యక్తి ఇప్పటికే డబ్బులు చెల్లించారు. తనను జింజర్‌హనీ కలుస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

ఈ వెబ్‌సైట్లలో చేరడానికి ఎలాంటి రుసుములూ లేవు. అయితే, దీనిలో ఎవరైనా మెసేజ్‌లు పంపించాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ ప్యాకేజీలు ఆరు డాలర్ల (రూ.500) నుంచి 300 డాలర్ల (రూ.24,000)వరకు ఉన్నాయి.

”ఈ సైట్లలో రిజిస్టర్ చేసుకునే యువత సాధారణంగా తమ చుట్టుపక్కల ఉండే మహిళలను కలవాలని అనుకుంటారు. కానీ, కాస్త వయసు పైబడిన వారు మాత్రం సెక్స్ చాట్‌లు, అశ్లీల ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటారు’’అన అబియోదున్ చెప్పారు.

ఈ సబ్‌‌స్క్రైబర్లను వీలైనంత సమయం వెబ్‌సైట్ మీద గడిపేలా చూడటమే అబియోదున్, అతడి సహచరుల లక్ష్యం.

”ప్రతి మెసేజ్‌లోనూ కనీసం 150 అక్షరాలు ఉండాలి, పైగా తిరిగి ప్రశ్నలు వచ్చేలా ఆ మెసేజ్‌ను రాయాలి’’ అని ఆయన చెప్పారు.

అఫ్రికా దేశం సురీనామ్‌లోని ఒక అవుట్ సోర్సింగ్ సంస్థ లాజికల్ మోడరేషన్ సొల్యూషన్ (ఎల్ఎంఎస్) సేవలను మెటియోర్ ఇంటెరాక్టివ్ బీవీ ఉపయోగించుకుంటోంది. ఎల్ఎంఎస్‌ను సురీనామ్ పౌరుడు ఒరానో రోస్ స్థాపించారు. నైజీరియా నుంచి వ్యక్తులను నియమించుకోవడం, శిక్షణ ఇవ్వడం కోసం దీన్ని మొదలుపెట్టారు.

నైజీరియాలోని లాగోస్, అబుజా రాష్ట్రాల నుంచి వందల మందిని సంస్థలో చేర్పించుకొని, శిక్షణ ఇస్తున్నట్లు రుజువుచేసే వాట్సాప్, టెలిగ్రామ్, స్కైప్ అకౌంట్ల వివరాలు, చాట్లను బీబీసీ సంపాదించింది.

మొదట ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, టెలిగ్రామ్‌లలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తారు. ముఖ్యంగా నైజీరియాలో చదువుకున్న నిరుద్యోగులే వీరి లక్ష్యం. ”ఆన్‌లైన్ రోల్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, చాట్ మోడరేటర్ రోల్స్’’ పేరుతో వీరిని నియమించుకుంటారు.

ఎల్‌ఎంఎస్ కోసం వ్యక్తుల్ని నియమించుకునే బృందాలను నడిపించే వారిలో అడెడమోలా యూసుఫ్ ఒకరు. జర్మనీకి చెందిన ఆమె సోషల్ మీడియాలో ప్రకటనల బాధ్యత చూసుకుంటారు. ఆమె అకౌంట్లలో విలాసవంతంగా జీవిస్తున్నట్లు చెప్పే ఫోటోలు ఉంటాయి.

”విసుగెత్తిపోయిన తెల్లజాతి పురుషులతో మీరు చాట్ చేయాలి. ఈ ఉద్యోగానికి అటు జర్మనీలో, ఇటు నైజీరియాలో చట్టపరంగా ఎలాంటి అభ్యంతరాలూ లేవు’’ అని ఒక వాట్సాప్ చాట్‌లో ఆమె చెప్పారు.

రెండేళ్ల నుంచీ చాలా మందిని యూసుఫ్ నియమించుకున్నారు. గత నవంబరులో నిర్వహించిన నియామకాల్లో, వందల మంది పాల్గొన్నారు. అయితే, ఈ విషయంపై స్పందించాలని బీబీసీ ఆమెను కోరింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

”పశ్చిమ దేశాల క్లయింట్లు అశ్లీల చాట్ల కోసమే వెబ్‌సైట్లకు ఈ వస్తారు’’అని కొత్తగా చేరిన వ్యక్తికి ఒక ట్రైనర్ వాట్సాప్‌లో సూచించారు. అయితే, ఈ ఉద్యోగంలో చేరే ముందు వారికి ఒక ఇంగ్లిష్ పరీక్ష పెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీరు నైజీరియాకు చెందినవారని తెలియకుండా జాగ్రత్త పడతారు.

”I am అని రాయాలి. Am అని మాత్రం రాసి వదిలేయకూడదు’’అని ఒక వ్యక్తి చేసిన తప్పును వాట్సాప్ గ్రూపులో సరిచేస్తూ కనిపించారు.

మరోవైపు నైజీరియాలోని ఎల్ఎంఎస్ డైరెక్టర్ నిఖోలస్ అకండే గ్రూపులో మాట్లాడుతూ.. ఈ ఉద్యోగం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని చెప్పారు.

ఈ విషయంపై నిఖోలస్‌ను సంప్రదించినప్పుడు ఆయన స్పందించలేదు.

ఒక్కొక్కరికి నెలకు 355 డాలర్లు (రూ.28,000) చెల్లించి ఎల్ఎంఎస్ విధుల్లోకి తీసుకుంటోంది. రోజుకు వీరు కనీసం 500 మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది.

సదరు ప్రాంతానికి చెందిన సంస్కృతి, భాష, మాట్లాడే తీరుపై కొత్తగా నియమించుకునే వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు.

రోజుల నుంచి వారాల వరకు ఈ శిక్షణ ఉంటుంది.

శిక్షణ అనంతరం వెబ్‌సైట్‌లోని లాగిన్ వివరాలు ఇస్తారు. దీంతో వారు క్లయింట్ల చిరునామా, ఫోన్ నంబరు, వయసు లాంటివి తెలుసుకోవచ్చు.

తమతో చాట్ చేసే మహిళలను కలుసుకునేందుకు ఇప్పటికే తాము 300 డాలర్ల (రూ.24,000) నుంచి 700 డాలర్ల (రూ.56,000) వరకు ఖర్చు పెట్టినట్లు వెబ్‌సైట్లో కొందరు క్లయింట్ల కమెంట్లు కనిపిస్తున్నాయి.

”నేను దాదాపు 20 మంది మహిళలతో చాట్ చేశాను. కలుద్దామంటే అందరూ మాటలు దాటేస్తుంటారు’’అని ఒక క్లయింట్ సైట్‌లో కామెంట్ చేశారు. ఇప్పటికే తాను 64.99 డాలర్లు (రూ.5200) చెల్లించినట్లు ఆయన వివరించారు.

అయితే, తమ వెబ్‌సైట్‌లోని షరతుల్లోనే కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ ఉండొచ్చని తాము స్పష్టంగా చెప్పామని మెటియర్ ఇంటెరాక్టివ్ చెబుతోంది. అయితే, సంస్థకు చెందిన కొందరు నైజీరియా ఉద్యోగులు ఎందుకు ఫేక్ మ్యాప్ టూల్ ఉపయోగిస్తున్నారో సంస్థ వివరించలేదు.

ఒకవేళ నిజంగా ఎల్‌ఎంఎస్ ఇలాంటి అశ్లీల చాట్లను నడిపిస్తే, సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని నైజీరియా అధికారి ఒకరు చెప్పారు.

మరోవైపు ఎల్ఎంఎస్ ఎలాంటి తప్పుడు పనులూ చేయడం లేదని, నైజీరియాలో చట్టాల గురించి తనకు పెద్దగా తెలియదని రోస్ వివరించారు. అయితే, ఆయన సురీనామ్ పౌరుడు కావడంతో, నైజీరియాలో ఆయన్ను విచారించడం చాలా కష్టం.

ఇంటర్నెట్ మోసాలతో పోలిస్తే, తమ నేరం చాలా చిన్నదని అబియోదున్ భావిస్తున్నారు.

”నిజానికి ఇది మనం ప్రేమించిన వ్యక్తి లేదా స్నేహితులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది’’అని ఆయన చెప్పారు. జింజర్‌హనీ పేరుతో ఆయన చాట్‌చేస్తున్నప్పుడు వెంటనే కలవాలని ఉందని 50ఏళ్ల ఆ అమెరికా క్లయింట్ తనను పదేపదే అడుతున్నారని ఆయన వివరించారు.

”నేను మా కుక్కను బయటకు తీసుకెళ్లాలి’’అని జింజర్‌హనీ అకౌంట్ నుంచి ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఎరికా అనే మరో అకౌంట్ తెరిచారు. లండన్‌కు చెందిన శామ్ ఆమెతో మాట్లాడేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)