హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?

ఇరాన్ మొరాలిటీ పోలీసుల చేతిలో 22 ఏళ్ల మహసా అమీనీ మరణం ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు రగిలించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ విధించే డ్రెస్ కోడ్‌ను, దానిని కఠినంగా అమలు చేస్తున్నవారికి వ్యతిరేకంగా మహిళలు తలకు కట్టుకునే హిజాబ్‌లను తగులబెట్టి తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దేశం నలుమూలలా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

గస్త్-ఎ-ఇర్షాద్ (గైడెన్స్ గస్తీ దళాలు) అనేది ఇరాన్‌లో ఒక ప్రత్యేక పోలీసు విభాగం. ప్రజలు ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించేలా చూడడం, “సక్రమంగా” దుస్తులు ధరించని వ్యక్తులను నిర్బంధించడం వంటివి వీరి విధుల్లో భాగం.

షరియా చట్టాలను అనుసరించి రూపొందించిన ఇరాన్ చట్ట ప్రకారం, మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. తల, జుట్టు కనిపించకూడదు. శరీరం కనబడకుండా పొడవైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

మహసా అమీనీ ధరించిన హిజాబ్ కింద నుంచి జుట్టు కొంచం కనిపిస్తోందని టెహ్రాన్ మొరాలిటీ పోలీసులు ఆమెను సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. నిర్బంధంలో ఆమె స్పృహ తప్పిపడిపోయారు. కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆస్పత్రిలో మరణించారు.

పోలీసు అధికారులు ఆమెను తలపై లాఠీతో కొట్టారని, ఆమె తలను వాహనానికేసి కొట్టారని వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు.

ఒక మొరాలిటీ పోలీసు అధికారి అజ్ఞాతంగా బీబీసీతో మాట్లాడారు. ఇది ఒక అరుదైన ఇంటర్వ్యూ. గస్త్-ఎ-ఇర్షాద్‌లో పనిచేసిన అనుభవాలను ఆయన పంచుకున్నారు.

“మహిళలను రక్షించేందుకే మొరాలిటీ పోలీసు వ్యవస్థ ఉందని వాళ్లు మాకు చెప్పారు. మహిళలు సరైన దుస్తులు ధరించకపోతే, మగవాళ్లు రెచ్చిపోయి వారికి హాని కలిగిస్తారని చెప్పారు” అని ఆయన చెప్పారు.

వాళ్లంతా ఆరు బృందాలుగా పనిచేశారని, ఒక్కో బృందంలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండేవారని, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టేవారని చెప్పారు.

“ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. జనాన్ని గైడ్ చేయడమే మా లక్ష్యమైతే, రద్దీగా ఉండే ప్రదేశాలను ఎందుకు ఎంచుకోవాలి? అంటే అలాంటిచోట్ల ఎక్కువమందిని అరెస్ట్ చేయవచ్చు. ఇది వేట లాంటిది. వేటాడాడానికే మేం వెళుతున్నట్టు ఉండేది.”

డ్రెస్ కోడ్ ఉల్లంఘించినవారిని ఎక్కువమందిని పట్టుకోలేకపోతే తను సరిగా పనిచేయట్లేదని తన పై అధికారి ఆరోపించేవారని ఆ అజ్ఞాత అధికారి చెప్పారు. ముఖ్యంగా, నైతికత పాటించనివారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్లు ప్రతిఘటిస్తే, తమ పని మరింత కష్టమయ్యేదని ఆయన చెప్పారు.

“జనాన్ని తీసుకొచ్చి వ్యాన్‌లోకి ఎక్కించాలి. అదే వాళ్లకు కావాలి. అలా చేస్తున్నప్పుడు నేనెన్ని సార్లు ఏడ్చానో తెలుసా? నేను మీలాంటి వాడిని కాదని నా పై అధికారులకు చెప్పాలనుకునేవాడిని. మాలో చాలామంది సాధారణ సైనికులు. తప్పనిసరి మిలటరీ సర్వీస్ చేస్తున్నవారు. నాకు చాలా బాధ అనిపించేది.”

1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో ఇస్లామిక్ విలువలను కఠినంగా అమలుచేసే పద్ధతి మొదలైంది. “చెడు హిజబ్” అంటే హిజాబ్ సరిగ్గా ధరించకపోవడం, తప్పనిసరిగా ధరించాల్సిన దుస్తులను ధరించకపోవడం మొదలైనవాటికి వ్యతిరేకంగా ఇరాన్ అధికారులు పోరాటం ప్రారంభించారు. మహిళలు నిరాడంబరమైన దుస్తులు ధరించాలన్నదే వీరి ప్రధాన లక్ష్యం.

అప్పట్లో చాలామంది మహిళలు ఈ నియమాలను పాటించేవారు. కానీ, చిన్న చిన్న స్కర్టులు ధరించడం, తల కప్పుకోకపోవడం కూడా టెహ్రాన్‌లో తరచుగా కనిపించేది. 1979లో షా మొహమ్మద్ రెజా పహ్లావిని పదవి నుంచి కిందకు దించేవరకు కొంతమంది మహిళల దుస్తుల్లో పాశ్చాత్త ధోరణి కనిపించేది. రెజా పహ్లావికి పాశ్చాత్య అనుకూల భావాలు ఉండేవి. ఆయన భార్య ఫరా తరచూ పాశ్చాత్య దుస్తులు ధరించేవారు. ఆమెను ఆధునిక మహిళకు ఉదాహరణగా చెప్పుకునేవారు.

కానీ, ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించిన కొద్ది నెలలకే, రెజా పహ్లావి హయాంలో రూపుదిద్దుకున్న మహిళా హక్కుల చట్టాలను రద్దు చేయడం ప్రారంభించారు.

“ఇదంతా ఒక్క రాత్రిలో జరగినది కాదు. క్రమక్రమంగా జరిగింది” అని మానవ హక్కుల న్యాయవాది, 78 ఏళ్ల మెహ్రంగీజ్ కర్ చెప్పారు. ఇరాన్‌లో మొట్టమొదటి హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి సహకారం అందించిన కార్యకర్త ఆమె.

“ఇస్లామిక్ ఉద్యమం తరువాత మహిళలు, పురుషులు వీధుల్లో నిల్చుని హిజాబ్‌లను ఉచితంగా, గిఫ్ట్ పేపర్‌లో చుట్టి మహిళలకు బహుమతులుగా అందించారు” అని మెహ్రంగీజ్ చెప్పారు.

1979 మార్చి 7న ఇస్లామిక్ విప్లవ నాయకుడు అయతొల్లా రుహోల్లా ఖొమేనీ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. కార్యాలయాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరని, అలా ధరించినవారిని “నగ్నంగా” పరిగణించాలని ఆదేశించారు.

“ఆయన ప్రసంగాన్ని చాలామంది ఇస్లామిక్ విప్లవకారులు ఒక ఆజ్ఞగా స్వీకరించారు. బలవంతంగానైనా మహిళలు హిజాబ్ ధరించేలా చూడాలని భావించారు. దీన్ని ఒక్క రోజులొనే అమలుచేయడం ప్రారంభిస్తారని చాలామంది భయపడ్డారు. అందుకే మహిళలు ప్రతిఘటించడం మొదలుపెట్టారు” అని మెహ్రంగీజ్ కర్ చెప్పారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో నివాసముంటున్నారు.

ఖొమేనీ ఆదేశం వచ్చిన మర్నాడు, అంటే 1979 మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు, ప్రధానంగా మహిళలు టెహ్రాన్ వీధుల్లో నిరసనలు చేపట్టారు.

అయతొల్లా ఖొమేనీ ఆజ్ఞ ఇచ్చేసినప్పటికీ, మహిళల విషయంలో “సరైన” వస్త్రధారణ అంటే ఏమిటో నిర్ణయించుకునేందుకు అధికారులకు కొంత సమయం పట్టింది.

“ఈ విషయంలో స్పష్టమైన సూచనలేమీ లేవు. అందుకని, వాళ్లు కొంతమంది మోడల్స్ పోస్టర్లు, బ్యానర్లను కార్యాలయాల గోడలపై వేలాడదీశారు. ఆ పోస్టర్లలో ఉన్నట్టు మహిళలు హిజాబ్ ధరించాలి. లేదంటే వాళ్లకు కార్యాలయాలలో ప్రవేశం ఉండదు” అని మెహ్రంగీజ్ వివరించారు.

1981 నాటికి, మహిళలు, బాలికలు నిరాడంబరమైన “ఇస్లామిక్” దుస్తులు ధరించాలని చట్టబద్ధం చేశారు. అంటే ఒళ్లంతా కప్పేలా బుర్ఖా, తలపై హిజాబ్, చేతులు కనబడకుండా ఓవర్‌కోట్ తప్పనిసరిగా వేసుకోవాలి.

“అయితే, మహిళలు తప్పనిసరి హిజాబ్‌కు వ్యతిరేకంగా వ్యక్తిగత స్థాయిలో పోరాటం చేస్తూనే ఉన్నారు. హిజాబ్ ధరించడంలో కొంత సృజనాత్మక చూపించడం, జుట్టు కొంచం కనిపించేలా కప్పుకోవడం లాంటివి చేసేవారు. వాళ్లు మమ్మల్ని ఆపిన ప్రతిసారి మేం పోరాటం చేశాం” అని మెహ్రంగీజ్ చెప్పారు.

1983లో, బహిరంగ ప్రదేశాల్లో జుట్టు కప్పుకోని మహిళలను 74 కొరడా దెబ్బలతో శిక్షించవచ్చని పార్లమెంటు నిర్ణయించింది. ఈమధ్యే, 60 రోజుల వరకు కారాగార శిక్షను కూడా జోడించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చట్టాలను అమలు చేసేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. అన్ని వయసుల స్త్రీలు తరచుగా బహిరంగ ప్రదేశాల్లో ఈ చట్టాలను ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బిగుతుగా ఉండే దుస్తులు, తొడల వరకు ఉండే కోట్లు, రంగురంగుల హిజాబ్‌లు ధరించడం, జుట్టు బాగా కనిపించేలా హిజాబ్ వెనక్కి కట్టుకోవడం ద్వారా ప్రతిఘటిస్తూనే ఉన్నారు.

ఇరాన్ అధ్యక్ష పదవిలో ఎవరు ఉంటారన్న దానిబట్టి, ఈ నియమాలు ఏ మేరకు అమలు చేస్తారు, శిక్షల తీవ్రత ఎంత వరకు ఉంటుందన్నది మారుతూ ఉంటుంది.

2004లో టెహ్రాన్ మేయర్, అతి సంప్రదాయవాది అయిన మహమూద్ అహ్మదీనెజాద్ అధ్యక్ష పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ అంశంలో కొంత ప్రగతిశీలంగా కనిపించడానికి ప్రయత్నించారు.

“ప్రజలకు భిన్నమైన అభిరుచులు ఉంటాయి. వారందరికీ మనం సేవలు అందించాలి” అని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, ఎన్నికల్లో ఆయన గెలిచిన మరుసటి సంవత్సరం గస్త్-ఎ-ఇర్షాద్‌ను అధికారికంగా స్థాపించారు. అప్పటి వరకు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను అనధికారికంగా అమలుచేసేవారు. పారామిలటరీ దళాలు, చట్టలను అమలుచేసే ఇతర వ్యవస్థలు ఈ డ్రెస్ కోడ్ అమలును అనధికారికంగా పర్యవేక్షించేవి.

మొరాలిటీ పోలీసులు కఠినమైన వైఖరి అవలంబిస్తారనే విమర్శలు ఉన్నాయి. మహిళలను తరచుగా అరెస్టులు చేయడం, సొంతవారెవరైనా వచ్చి ఇకపై వారు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటిస్తారని హామీ ఇస్తేనే వారిని విడుదల చేసేవారు.

“లిప్‌స్టిక్ పూసుకున్నామని నన్ను, మా అమ్మాయిని అరెస్ట్ చేశారు. మమ్మల్ని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. నా భర్తను పిలిచి, హిజాబ్ లేకుండా ‘మమ్మల్ని బయటకు పంపించనని’ మాటిస్తూ ఒక కాగితంపై సంతకం చేయమన్నారు” అని ఇస్ఫహాన్‌ నగరానికి చెందిన ఒక మహిళ బీబీసీతో చెప్పారు.

టెహ్రాన్‌కు చెందిన మరొక మహిళను కూడా ఇలాగే అరెస్ట్ చేశారు. ఆమె వేసుకున్న బూట్లు పురుషులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెబుతూ ఒక మహిళా ఆధికారి ఆమెను నిర్బంధించారు.

“నేను నా భర్తకు ఫోన్ చేసి, మరొక జత చెప్పులు తీసుకురమ్మని చెప్పాను. నేను సరైన దుస్తులు ధరించలేదని ఒక కాగితంపై సంతకం చేయించారు. ఇప్పుడు నాపై క్రిమినల్ రికార్డు ఉంది” అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఇవే కాకుండా, కొట్టడం, ఇంకా క్రూరంగా ప్రవర్తించడం, అసాధారణ రీతిలో శిక్షించడం వంటి ఎన్నో ఘటనలను అనేకమంది మహిళలు బీబీసీతో పంచుకున్నారు.

ఒక మహిళను అరెస్ట్ చేసి ఒంటిపైకి బొద్దింకలు పాకిస్తామని బెదిరించారు.

గత ఏడాది ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనల జాబితాను అమలు చేసేందుకు ఆగస్టు 15న ఆర్డర్‌పై సంతకం చేశారు.

నిఘా కెమేరాల సహాయంతో హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి జరిమానా విధించడం, లేదా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, హిజాబ్ నిబంధనలను ప్రశ్నించినా, ఆన్‌లైన్‌లో దానికి వ్యతిరేకంగా పోస్టులు రాసినా అరెస్ట్ చేయడం వంటివి ఈ కొత్త నిబంధనల్లో ఉన్నాయి.

దాంతో, అరెస్టులు పెరిగాయి. కానీ, నిరసనగా మహిళలు హిజాబ్ లేకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం కూడా పెరిగింది. అమీనీ మరణం తరువాత ఇది ఇంకా పెరిగింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న జర్నలిస్ట్, కార్యకర్త మసీహ్ అలినేజాద్ గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో హిజాబ్ వ్యతిరేక ప్రచారాలు నిర్వహించారు. అవన్నీ చాలా వైరల్ అయ్యాయి. ప్రస్తుత అశాంతి, నిరసనల వెనుక ఆమె నిర్వహించిన #mystealthyprotest లాంటి ఎన్నో హ్యాష్‌ట్యాగ్ ప్రచారాల హస్తం ఉందని ఇరాన్ ప్రభుత్వం సహా చాలామంది విశ్వసిస్తున్నారు.

అమీనీ మరణం చాలామందిని వ్యక్తిగతంగా కదిలించిందని మసీహ్ అలినేజాద్ అభిప్రాయపడ్డారు.

శనివారం సకెజ్‌ నగరంలో అమీనీ అంత్యక్రియల సందర్భంగా మహిళలు తమ హిజాబ్‌లను తొలగించి గాలిలో ఊపడం ప్రారంభించారు.

ఆ తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. హిజాబ్‌లకు నిప్పంటించి వీడియోలు చిత్రీకరించారు. పురుషులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు.

“ఇదంతా చూస్తూంటే, జర్మనీలో బెర్లిన్ వాల్ పగలగొట్టడానికి ప్రజలు చేసిన ఉద్యమం గుర్తొస్తోంది. ఇది అలాంటి క్షణం” అని అలినెజాద్ చెప్పారు.

“నాకు ఆశ, ఉత్సాహం కలిగించిన విషయం ఏమింటంటే మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయిలు ఒంటరి పోరాటం చేయడంలేదు. ఈసారి పురుషులు కూడా వారితో జతకలిశారు” అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)