సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మాజీ సీఎం – ఆ కేసులో తదుపరి ప్రొసీడింగ్స్‌కు బ్రేక్

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. లంచం తీసుకున్న కేసులో ఆయనపై తదుపరి చర్యలకు వెళ్లకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇదే కేసులో నోటీసులను కూడా జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లంచం తీసుకున్న కేసు విషయంలో యడియూరప్ప ఇక తదుపరి చర్యలను ఎదుర్కొనకపోవచ్చు.

అవినీతి నిరోధక చట్టం కింద యడియూరప్పపై ఇదివరకు కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో నలుగురి పేర్లను ఇందులో చేర్చారు. ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. తనతో పాటు ఇతరులపై దాఖలైన లంచం ఫిర్యాదుపై విచారణను పునఃప్రారంభించాలంటూ కర్ణాటక హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది.

బీదరహళ్లి కొనదాసపురలో బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) అధికారులు అక్రమంగా నిర్మించిన ఫ్లాట్ల కేసులో యడియూరప్ప అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది. ఎస్టీ సోమశేఖర.. బీడీఏ ఛైర్మన్‌గా ఉన్న హయాంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రామలింగం కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాజెక్ట్‌ను అప్పగించేలా చేయడానికి 12.5 కోట్ల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర సహా ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు అందాయి.

సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు యడియూరప్పపై కేసు నమోదు చేశారు. దీన్ని పునరుద్ధరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై యడియూరప్ప అప్పీల్‌కు వెళ్లారు. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నలుగురికి నోటీసులు ఇచ్చారు.