సీఎం జగన్ ముందుకొస్తే మేము సిద్దం – మరో వరం ప్రకటించిన నితిన్ గడ్కరీ..!!

ఏపీ తమకు ముఖ్యమైన రాష్ట్రమని..ఈ రాష్ట్రంలో అపార సహజ వనరులు ఉన్నాయి. వాటి ని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైన రాష్ట్రమని..ఎక్కువ సముద్రతీరం ఉన్న రాష్ట్రమని వివరించారు. తాను నేను నౌకాయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. విశాఖపట్నం అభివృద్ధికి చాలా నిధులు కేటాయించానని చెప్పుకొచ్చారు. ఏపీలో రూ.5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు.

2024 నాటికి ఏపీలో హైవే ప్రాజెక్టులు పూర్తవుతాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ భూమి కేటాయిస్తే.. రాష్ట్రంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని..నితిన్ గడ్కరీ స్పష్టం చేసారు. రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన.. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 16వ నంబర్ జాతీయ రహదారిపై 5 ఫ్లైఓవర్ల నిర్మాణంతోపాటు పలు రోడ్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. హైవే ప్రాజెక్టులు, పైవంతెనలకు శంకుస్థాపన చేశారు. వచ్చే 3 నెలల్లో.. ఆంధ్రప్రదేశ్​కు మరో 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

అప్పట్లో రెండు ఓడరేవుల విషయంలో ఇక్కడి ప్రజలకు వివాదం ఉండేదని గుర్తు చేసారు. తాను రెండు ప్రాజెక్టులూ మంజూరు చేశానని చెప్పారు. ఎందుకంటే రెండు ఓడరేవులూ ముఖ్యమేనన్నారు. నౌకాయానం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఓడ రేవులు ఇంజిన్‌లా పనిచేస్తాయని వివరించారు. ఇదే సమయంలో ఏపీలో రోడ్ల విషయం గురించి గడ్కరీ ప్రస్తావించారు. అమెరికా ధనిక దేశం అవడం వల్ల అక్కడ రోడ్లు బాగుండడం కాదు.. అక్కడ రోడ్లు బాగుండడం వల్లే అమెరికా సంపన్న దేశమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ కెనడీ చెప్పిన ఓ సూక్తిని నేనెప్పుడూ చెబుతుంటానన్నారు. ఆంధ్రలో కూడా మంచి రోడ్లు ఉంటే.. దేశంలోనే సంపన్న రాష్ట్రం అవుతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులు పూర్తయితే కాకినాడ పోర్టు ద్వారా ఖనిజాలు, జీవ ఇంధనం, గ్రానైట్‌ వంటివి సులభంగా రవాణా చేయవచ్చని వివరించారు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, పెట్టుబడి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని.. నీరు, విద్యుత్‌, రవాణా లేకపోతే ఇండస్ట్రీలు రావని స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని.. అవి లేకపోతే పేదరిక నిర్మూలన అసాధ్యమని అన్నారు. జాతీయ రహదారులపై ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే మొక్కలు పెంచడానికి కడియం నర్సరీలో ఆరా తీస్తున్నామని గడ్కరీ తెలిపారు.