సీఎం కల్పించేవన్నీ భ్రమలే.!ప్రజలు వాస్తవాలు గ్రహించి కేసీఆర్ ను తరిమికొట్టాలన్న ఈటల.!

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై హుజునాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక అసెంబ్లీ అని, ఉద్యమంలో స్పీకర్ పోడియం దగ్గరే పడుకున్నామని, కానీ ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో లేచి నిలబడితేనే సస్పెండ్ చేసి పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారని, అందుకే ప్రజాక్షేత్రంలోకి వచ్చానని, ఇక్కడ ఆపగలరా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చెయ్యకుండా రైతులను ఎగవేతదారులుగా లెక్కకట్టేలా చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అని, రైతులు అప్పులపాలు కావడానికి కారణం చంద్రశేఖర్ రావు అని, మహిళా రుణాల వడ్డీ కట్టకుండా సీఎం మోసం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

మన బడ్జెట్ ఆకలికి పరిష్కారం చూపే సొమ్ము అని, భూ స్వాములకు ఇచ్చేది కాదని, పైసలు ఎక్కువ అయితే కౌలు రైతులకు ఇవ్వాలి కానీ భూ స్వాములకు కాదు అని సీఎం చంద్రశేఖర్ రావుకు ఈటల రాజేందర్ గుర్తు చేసారు. ఫసల్ భీమా లేదు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ లేదు, గ్రీన్ హౌస్ కి, డ్రిప్ కి దేనికీ సబ్సిడీ లేదు అన్నీ ఆపి రైతుబందు ఇస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ పథకాలు అన్నీ కలిపి మనకునిచ్చేది 25 వేలకోట్లు మాత్రమేనని, దానికే మురిసిపోయి ఓట్లు వేస్తున్నామని, కానీ గల్లి గల్లికి బెల్ట్ షాపు పెట్టీ చంద్రశేఖర్ రావు మనదగ్గర గుంజుతున్న డబ్బు 42 వేల కోట్లు అని వివరించారు. ఎవరు ఎవరికి ఇస్తున్నారని సీఎం ను ఈటల సూటిగా ప్రశ్నించారు.

ఆడపిల్లల పుస్తెలు తెగిపడుతున్నాయని, పిల్లలు అనాధలు అవుతున్నారని, వీటన్నిటికీ చరమగీతం పాడాలి అంటే చంద్రశేఖర్ రావును ఇంటికి పంపించాలన్నారు ఈటల రాజేందర్. ఆ సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకు చూస్తే చాలని, సీఎం పనిచేసే ప్రభుత్వమా కాదా అనడానికి రుణమాఫీ ఒక్కటి చాలని వివరించారు. లక్షరూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని మాట ఇచ్చారని, ఇప్పటికీ చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న సిఎం చంద్రశేఖర్ రావు మాత్రమేనని మండి పడ్డారు ఈటల.

రుణమాఫీ తీర్చక, బ్యాంక్ లో రుణం రాక షావుకార్ల దగ్గర రైతులు అప్పులు చేయడానికి కారకుడు చంద్రశేఖర్ రావు అని, రైతు పిల్లలకు విద్యా రుణం కోసం వెళితే ఇవ్వడం లేదని మండి పడ్డారు. 35 లక్షల రైతులను ఎగవేతదారుల లిస్ట్ లో చేర్చిన ఘనత సీఎందేనని అన్నారు. దళితులకు మూడు ఎకరాలు దిక్కులేదు సరికదా, దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నాడని సీఎం మండి పడ్డారు. ఆ భూములను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటున్న దుర్మార్గపు నాయకుడు చంద్రశేఖర్ రావు అని అన్నరు. కేంద్రం పేదల ఇళ్ల కోసం డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా, తాను ఇస్తా అన్న డబుల్ బెడ్ రూం ఇవ్వకుండా పేదల సొంతింటి కలను సీఎం కల్లలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు ఈటల.

అసెంబ్లీలో మందబలంతో మమ్ముల్ని బయటికి పంపించవచ్చు కానీ గులాబీ పార్టీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి బీజేపీ పల్లె పల్లెనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని వివరించారు. ఈ గడ్డమీద ఎగిరేది కాషాయ జెండానేనని, ప్రజలు ఇచ్చిన అధికారంతో చంద్రశేఖర్ రావుకు కళ్ళు నెత్తికి ఎక్కాయని, ఆ అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. అబద్దాల ముఖ్యమంత్రిని గద్దె దించడమే మనందరి లక్ష్యం అని ఈటల రాజేందర్ మరోసారి పిలుపునిచ్చారు.