సనత్‌ నగర్ ఈఎస్ఐ డీన్‌కు ప్రతిష్ఠాత్మక పదవి – ఏరికోరి ఎంచుకున్న ప్రధాని మోదీ..!!

హైదరాబాద్: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు. జాతీయ స్థాయి సంస్థల్లో నియామకాల మీద ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఈ మేరకు ఆయన పేరును సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్ర మంత్రివర్గ కమిటీకి ఛైర్మన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తోన్నారు.

ప్రస్తుతం డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్‌గా పని చేస్తోన్నారు. ఆయన పదవీకాలం ఇవ్వాళ్టితో ముగియనుంది. ఆయన స్థానంలో డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను నియమితులయ్యారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి అయిదు సంవత్సరల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. లేదా 65 సంవత్సరాలు నిండేంత వరకూ ఆ పదవిలో ఉంటారు. ప్రతినెలా 2,25,000 రూపాయల మొత్తాన్ని వేతనంగా అందుకుంటారు.

డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్‌గా 2017 మార్చ్ 28న నియమితులయ్యారు. ఆ తరువాత రెండుసార్లు ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించలేదు కేంద్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను నియమించింది. సనత్ నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో డీన్‌గా చేరకముందు ఆయన ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌గా పని చేశారు. 2016లో ఈఎస్ఐ వైద్య కళాశాల డీన్‌గా నియమితులయ్యారు.

ఎయిమ్స్ డైరెక్టర్ పదవి కోసం మరి కొన్ని పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ బెహారీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆయనతో పాటు ఎయిమ్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రమోద్ గర్గ్, ఎండోక్రినాలజీ విభాగాధిపతి డాక్టర్ నిఖిల్ టండన్, ట్రౌమా కేర్ చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్ర పేర్లను పరిశీలించారు.