లొంగిపోయిన మావోయిస్ట్ ఫిర్యాదు.. అజ్ఞాత మావోయిస్ట్ ఆజాద్ పై విప్లవోద్యమ చరిత్రలోనే సంచలన కేసు!!

విప్లవోద్యమ చరిత్రలోనే ఊహించని ఒక తొలి కేసు నమోదైంది. లొంగిపోయిన మావోయిస్ట్ చేసిన ఫిర్యాదుతో అజ్ఞాత మావోయిస్ట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు ఈ సంచలన కేసును నమోదు చేశారు. అరెస్టైన చర్ల ఎల్ జి ఎస్ కమాండర్ రజిత ఫిర్యాదుతో అజ్ఞాత మావోయిస్టు పార్టీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీని వివరాల్లోకి వెళితే

మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అరెస్టు అయిన మావోయిస్టు చర్ల ఎల్ జి ఎస్ కమాండర్ మడకం కోసి అలియాస్ రజిత ఆజాద్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకుడు ఆజాద్ పై ఐపీసీ 354 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మడకం కోసి అలియాస్ రజిత మావోయిస్టు పార్టీ నాయకుడు ఆజాద్ పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆజాద్ పై సంచలన ఆరోపణలు చేసిన రజిత కొన్ని రోజుల కిందట పార్టీ సభ్యులంతా గుండ్రాజి గూడెం అటవీ ప్రాంతంలో ఉన్న సమయంలో అజాద్ తోటి మహిళా సభ్యురాలితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై మావోయిస్టు అగ్ర నాయకత్వం ఆజాద్ ను మందలించింది అని కూడా రజిత పేర్కొన్నారన్నారు .

ఇదే సమయంలో ఆదివాసీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే వారని, మహిళా సభ్యులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, నేరపూరితమైన దాడికి ఆజాద్ పాల్పడుతున్నాడని రజిత ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆజాద్ వేధింపులతో సదరు మహిళ పార్టీని వీడిందని రజిత చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అజ్ఞాత మావోయిస్ట్ ఆజాద్ పై మహిళలపై నేరపూరిత దాడి చేసిన కేసులో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఛత్తీస్ ఘడ్ కు చెందిన మావోయిస్టు, మాధవి అలియాస్ సావిత్రి ఇటీవల తెలంగాణా పోలీసు ఎదుట లొంగిపోయారు. పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి ఎదుట ఆమె లొంగిపోయారు. 1992 నుంచీ పోలీసు దళాలపై జరిగిన 8 భారీ దాడులతో మాధవికి ప్రమేయం ఉందని, ఆమె ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయిల బహుమతిని పోలీసులు గతంలో ప్రకటించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన రామన్న భార్య సావిత్రి . ప్రస్తుతం మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తూ తాజాగా ఆమె పోలీసులు ఎదుట లొంగిపోయారు.