రాజకీయాల్లో

జూనియర్ నందమూరి తారక రామారావు రాజకీయాలపై డిఫెన్స్ ఆడుతున్నారు. స్పందించాల్సిన విషయాలపై తప్పనిసరి సందర్భం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా స్పందించాల్సి వస్తోంది. రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ వాటి క్రీనీడ అతనిపై పడుతోంది. భారతీయ జనతాపార్టీ కావచ్చు.. తెలుగుదేశం పార్టీ కావచ్చు.. వైసీపీ కావచ్చు.. తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు.. పార్టీ ఏదైనా, కార్యక్రమం ఏదైనా దానికి కేంద్ర బిందువుగా జూనియర్ ఎన్టీఆర్ మారుతున్నారు.

వివాదాలకు దూరంగా అన్నివర్గాలను రంజింప చేస్తూ సినిమాలు చేద్దామని అనుకుంటున్నారు. కానీ గతం వెంటాడుతోంది. 2009లో జరిగిన ఎన్నికల ప్రచారం కావచ్చు.. లేదంటే కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు.. ఎక్కడో చంద్రబాబునాయుడికో, జగన్మోహన్ రెడ్డికో జలుబు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తుమ్మాల్సి వస్తోంది. సినిమా కథానాయకుడికి మతాలు, కులాలు, ప్రాంతాలంటూ ఏవీ ఉండవు. అన్నివర్గాలను రంజింప చేయాలి.. అన్నివర్గాలు నా సినిమా చూడాలి అని హీరో అనుకుంటాడు. కానీ ఆయన్ను ఒక కులానికో, ఒక ప్రాంతానికో పరిమితం చేసేలా సంఘటనలు జరుగుతున్నాయి.

దీంతో జూనియర్ కూడా క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల ధాటిని తట్టుకునేందుకు, క్రీజులు ఎక్కువ సేపు కుదురుకోవాలనే ఉద్దేశంతో ఉండే బ్యాట్స్ మెన్ డిఫెన్స్ ఆడతాడు. ప్రస్తుతం రాజకీయం అనే సినిమా క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ లా జూనియర్ డిఫెన్స్ ఆడుతున్నాడు. తనను తాను కుదుటపరుచుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేపట్టింది.. గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కానీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తీసుకోదు. ఈ విషయం వారికి కూడా తెలుసు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించాలనే డిమాండ్ వచ్చింది. వారంతా ఎవరు స్పందించినా అది తెలుగుదేశం పార్టీ వాయిస్ లా ఉంటుంది. అంతకుమించి ఏమీ ఉండదు. అది వారికీ తెలుసు. అయినా స్పందించారు.

దగ్గుబాటి పురందేశ్వరి సీఎం జగన్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణ లాంటివారిది సాధారణంగానే ఉంటుంది. దీనిపై జూనియర్ స్పందించిన తీరుపైనే చర్చ నడుస్తోంది. కర్ర విరగకుండా, పాము చావకుండా అనేరీతిలో ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి వయసుకు తగ్గ పరిపక్వతతో స్పందించారని చెప్పవచ్చు. పేరు పెట్టడంవల్ల ఒకరు తగ్గరు.. లేదంటే పేరు పెట్టకపోవడంవల్ల పెరిగేదీ ఉండదు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా డిఫెన్స్ ఆడితే ఓవర్లు అయిపోతాయని, కాబట్టి ఎదురుదాడి చేయాల్సిన సందర్భంగా వచ్చినప్పుడు చేస్తాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. చూద్దాం.!!