రష్యాకు మళ్లీ షాకిచ్చిన భారత్-ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలని ఐరాసలో డిమాండ్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి. ఇప్పటికే రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ భారీ నష్టాల్ని చవిచూసింది. అయితే పాశ్చాత్యదేశాల అండతో కాస్తో కూస్తో పోరాడుతున్న ఉక్రెయిన్ కూడా ఈ యుద్ధాన్ని మరెంతో కాలం భరించే పరిస్ధితి లేదు. ఈ నేపథ్యంలో ఐరాసలో జరిగిన తాజా చర్చలో భారత్ రష్యాకు ఈ యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని కోరింది.

ఐరాస భద్రతామండలిలో జరిగిన చర్చలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై స్పందించారు. ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తోందని జైశంకర్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జరిగిన చర్చలో రష్యా తన సైనిక చర్యను ముగించాలని భారత్ బలంగా పిలుపునిచ్చింది. ఇది తీవ్ర ఆందోళనకర విషయంగా జైశంకర్ అభివర్ణించారు.

అన్ని శత్రుత్వాలను తక్షణమే విడనాడాలని, చర్చలతో దౌత్యానికి తిరిగి రావాలని భారత్ గట్టిగా కోరుతున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో చెప్పిన విధంగా ఇది యుద్ధ యుగం కాదని రష్యాకు గుర్తుచేశారు.
ఎలాంటి సంఘర్షణ పరిస్థితులలో కూడా మానవ హక్కుల, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనను సమర్థించలేమన్నారు. అటువంటి చర్యలు ఏవైనా జరిగినప్పుడు వాటిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం అత్యవసరమని
డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐరోపా, విదేశాంగ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి కేథరీన్ కొలోనా అధ్యక్షతన 15 మంది సభ్యుల సంఘంలో ఈ చర్చ జరిగింది.