మునుగోడులో బీజేపీ ముందంజ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసొస్తున్న అంశాలివే!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు బీజేపీ బహుముఖ వ్యూహం రచించింది. ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడానికి నిర్ణయించిన బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టింది. నియోజకవర్గంలో గ్రామగ్రామాన బిజెపి తరపున అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో చాప కింద నీరులా ప్రత్యర్థి పార్టీలలో బలంగా ఉన్న నేతలను కాషాయ కండువా కప్పి పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలలో ఉన్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన నేతలను బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేస్తే ఆయా పార్టీలు బలహీన పడతాయని భావిస్తున్న క్రమంలో చేరికలపై దృష్టి సారించారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ, టిఆర్ఎస్ పార్టీ లోనూ టికెట్ విషయంలో చోటుచేసుకున్న అసమ్మతి, స్థానికంగా పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు బిజెపికి లాభం చేకూర్చే వాతావరణాన్ని తీసుకువచ్చాయి.

దీంతోపాటు బీజేపీకి అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు తమ 1,000 మంది స్వచ్ఛంద సేవకులను ఇంటింటికీ పంపి బిజెపికి అనుకూలంగా ఓటు వేయమని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించారు. ఈ సంఘ్ కార్యకర్తలు ఒక్కొక్కరు 40 మంది ఓటర్లను ప్రభావితం చేస్తారని భావిస్తున్నారు. తెలంగాణకు కొత్తగా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన సునీల్ బన్సాల్‌కు వారు రిపోర్ట్ చేస్తారు. నాగ్‌పూర్‌కు చెందిన ఐదుగురు సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కూడా మునుగోడు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటారు.

ఉప ఎన్నికకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం రఘునందన్ రావు తమ వర్గాలకు చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన జి మనోహర్ రెడ్డికి 20-22 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని వారందరూ రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

ఇక తాజాగా ఏర్పాటుచేసిన స్టీరింగ్ కమిటీ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనుంది. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి వివేక్ వెంకటస్వామి చైర్మన్ గా 14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన బిజెపి ఈ ఎన్నికల స్టీరింగ్ కమిటీలో ఈటల రాజేందర్ తో పాటు, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు తదితరులకు స్థానం కల్పించింది.

మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ ముందు వరుసలో నిలిచింది. నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో మీనమేషాలు లెక్కించినా, చివరకు అభ్యర్థిగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో పార్టీలో ఉన్నవారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సహకరించే పరిస్థితి లేదన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. టిఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం విషయంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న చాలామంది నాయకులు మునుగోడులో క్షేత్రస్థాయిలో బలంగా పని చేయడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఈ అంశాలన్నీ బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో నిలిపాయి. రెట్టించిన ఉత్సాహంతో, వ్యూహాలతో బిజెపి ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది.