మా జోలికి వస్తే..: గుడివాడలో వివాదాస్పద ఫ్లెక్సీలు – అమరావతి రైతుల పాదయాత్ర వేళ..!!

అమరావతి: మూడు రాజధానులను కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకిస్తూ రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఇందులో భాగంగా వారు చేపట్టిన మహా పాదయాత్ర ఇవ్వాళ 12వ రోజుకు చేరుకుంది. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గల సూర్యభగవానుడి ఆలయం వరకు కొనసాగనుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలనేది వారి డిమాండ్.

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహా పాదయాత్రను ఆ ప్రాంత రైతులు చేపట్టారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి దీన్ని నిర్వహిస్తోంది. తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేన, వామపక్షాలు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయి.

ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, పార్వతిపురం మన్యం మీదుగా శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు యాత్ర కొనసాగనుంది. ఇవ్వాళ కృష్ణాజిల్లాలో ప్రవేశించింది. ఈ జిల్లాలో కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుంది. జిల్లా రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు భారీగా తరలివచ్చారు. అమరావతి రైతులకు పూలవర్షంతో స్వాగతం పలికారు.

ఇవ్వాళ ఈ పాదయాత్ర జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి కౌతవరం‌ వరకు కొనసాగనుంది. సాయంత్రం కౌతవరంలో యాత్ర ముగిస్తారు రైతులు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. పెడన, గుడివాడ నియోజకవర్గాలు అత్యంత కీలకమైనవని, అమరావతి రైతులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రకు లభిస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడులు సాగించే అవకాశం ఉందని హెచ్చరించారు. పోలీసులు స్పందించాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

దీనికి అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదం అయ్యాయి. తాము ఎవరి జోలికీ వెళ్లమని, తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అని రాసివున్న ఫ్లెక్సీలను కట్టారు. వైసీపీ యువదళం పేరుతో ఇవి వెలిశాయి. రెడ్డిపాలెం ప్రధాన రహదారి మీద ఈ భారీ ఫ్లెక్సీ ఏర్పాటైంది. అమరావతి పాదయాత్ర రెడ్డిపాలెం మీదుగా కొనసాగనున్న నేపథ్యంలో- దీన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే వాటిని తొలగించారు.