మళ్లీ చిక్కుల్లో గాలి జనార్ధన్ రెడ్డి? తెలంగాణ మంత్రి సబిత కూడా- సుప్రీంకోర్టు వారం డెడ్ లైన్…

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురిపై ఎప్పుడో పుష్కరం క్రితం దాఖలైన పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తి చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిటిషన్లలో తీర్పు రాకుండా ఉద్దేశపూర్వకంగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ నిందితులు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ గతంలో చేపట్టిన అక్రమ తవ్వకాల వ్యవహారంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. వీరిపై దశాబ్దం క్రితం దాఖలైన ఈ కేసుల్లో అప్పటినుంచి సుదీర్ఘ విచారణ సాగుతూనే ఉంది. నిందితులు మాత్రం బెయిల్ పై బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ మరోసారి కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు గతంలో వీరికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతో ఈ తేనెతుట్టె మరోసారి కదిలింది. స్పందించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఓబుళాపురం మైనింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నిందితులు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వీరిపై దాఖలైన అసలు కేసులో కంటే కూడా వీరు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగుతుండటంతో ఈ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతోంది. దీంతో సీబీఐ కదిలింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వీరి బెయిల్ రద్దు చేయాలని కోరింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు
డిశ్చార్జ్ పిటిషన్లపై నిందితులు విచారణను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలిచ్చింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల విషయంలో ఇప్పటికే సీబీఐ కోర్టులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై ఆగ్రహంగా ఉన్న సుప్రీంకోర్టు.. వీటిని తేల్చేందుకు డెడ్ లైన్ ఇచ్చింది. ఇప్పటికే నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ప్రారంభం కాలేదు. వీటిపై విచారణ చేపట్టి ఈ నెల 29 కల్లా సీబీఐ కోర్టు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీలైతే 29 కల్లా తీర్పులు కూడా ఇచ్చేయాలని సూచించింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టులో పరిణామాలు వేగంగా మారబోతున్నాయి. నిందితులు దాఖలు చేసిన వరుస డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ పూర్తయితే నిందితులకు చిక్కులు తప్పేలా లేవు.

హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిందితులు విచారణను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైతే ముందుగా డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం తేలిపోనుంది. అనంతరం అసలు కేసులపై విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ కేసుల్లోనూ వేగంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమస్యలు తప్పవు. ఓబుళాపురం కేసుల్లో బెయిల్ పై ఉన్న వీరిద్దరిని కోర్టు దోషులుగా నిర్దారిస్తే అసలే తెలంగాణ ఎన్నికల సమయంలో సబితమ్మకు కూడా చిక్కులు తప్పవు. అలాగే కర్నాటకలో తిరిగి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న గాలి జనార్ధన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారబోతున్నాయి.