మదీనాలో మరో కేజీఎఫ్ గుర్తింపు- భారీగా బంగారం, రాగి నిక్షేపాలు- సౌదీ సర్కార్ ప్రకటన

సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మదీనాలో భారీగా బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా సౌదీ జియోలాజికల్ సర్వే అధికారులు నిర్వహిస్తున్న తవ్వకాల్లో ఈ మేరకు నిక్షేపాల్ని గుర్తించినట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వీటి వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

మదీనాలో మహమ్మద్ ప్రవక్త మసీదుతో పాటు మరికొన్ని చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. ఇదే నగరంలోని అబా అల్ రహా వద్ద ఈ బంగారం నిక్షేపాల్ని కనుగొన్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే ట్వీట్ చేసింది. అలాగే వాదీ అల్ ఫరా వద్ద రాగి నిక్షేపాలు దొరికినట్లు తెలిపింది. వీటి ద్వారా సౌదీకి భారీ ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీటి వల్ల భారీగా విదేశీ పెట్టుబడులు రావొచ్చని సౌదీ అంచనా వేస్తోంది. అందుకే వీటి వివరాలను ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నిస్తోంది.

సౌదీలోని మదీనా నగరంలో కొత్తగా గుర్తించిన బంగారు, రాగి నిక్షేపాల కారణంగా సౌదీకి దాదాపు 533 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతే కాదు నాలుగు వేల ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సౌదీలో జరుపుతున్న తవ్వకాల్లో భారీగా నిక్షేపాలు బయటపడుతున్నాయి. వీటి వల్ల ఆ దేశానికి విదేశీ పెట్టుబడుల రాకతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. అందుకే వీటి వివరాల్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. మొత్తం సౌదీలో 5300 వరకూ విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ స్థాపించిన విజన్ 2030 కోడ్ లో భాగంగా విస్తరణ కోసం గుర్తించిన రంగాలలో మైనింగ్ కూడా ఒకటి. స్ధానిక మీడియా అల్ అరేబియా ప్రకారం ఈ ఏడాది జూన్‌లో క్రౌన్ ప్రిన్స్ పరిశోధన, అభివృద్ధి రంగానికి జాతీయ ప్రాధాన్యతలను ప్రకటించారు. మేలో సౌదీ పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ మైనింగ్ రంగంలోకి $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలను ప్రకటించింది.