భారత హిందువులపై పాకిస్తాన్ కడుపుమంట: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు ఇస్లామోఫోబియా

వాషింగ్టన్: భారత్‌పై పాకిస్తాన్ మరోసారి విరుచుకుపడింది. తన అక్కసును వెల్లగక్కుకుంది. ఐక్యరాజ్య సమితి వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలను పునరుద్ధరించుకోదలచుకోలేదని తేల్చి చెప్పింది. కాశ్మీర్‌ అంశాన్ని భారత్ స్వయంగా వివాదాస్పదం చేస్తోందని మండిపడింది. భారీ వరదలతో అల్లాడిపోతోన్న వేళ.. ఆర్థిక సహకారం గురించి ప్రస్తావించకుండా ఆ దేశం భారత్‌‌పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాకిస్తాన్ తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి.. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ భేటీలో ప్రసంగించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య గల దౌత్య సంబంధాల గురించి ప్రస్తావన రాగా.. ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో దౌత్యపర సంబంధాలను పునరుద్ధరించుకోదలచుకోలేదని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌లో కనివినీ ఎరుగని విధంగా వరదలు సంభవించిన పరిస్థితుల మధ్య పొరుగుదేశంతో సంబంధాన్ని పునర్నిర్మించుకోవడం, భారత్ నుంచి సహాయ, సహకారాలను కోరడం గురించి అడిగిన ప్రశ్నకు బిలావల్ భుట్టో సమాధానం ఇచ్చారు. అలాంటి పరిస్థితులేవీ ఉండబోవని తేల్చి చెప్పారు. సాయం అందించిన దేశాల్లో భారత్ ఒకటి కాదని తేల్చి చెప్పారు. భారత‌్‌తో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుకొనడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో భారత్ సహకరించట్లేదని అన్నారు.

భారత్‌తో కంటే అమెరికాతో తమకు సన్నిహిత, చారిత్రక సంబంధాలు ఉన్నాయని బిలావల్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సైతం స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించానని పేర్కొన్నారు. కాశ్మీరీ ప్రజల చట్టబద్ధమైన పోరాటానికి బలమైన మద్దతు ఉంటుందని, ఐఓసీ ఇదివరకే స్పష్టం చేసిందని చెప్పారు.

న్యూయార్క్‌లో నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ బిలావల్ భుట్టో ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు. హిందూత్వ భావజాలం వల్ల భారత్‌లో నివసిస్తోన్న కోట్లాది మంది ముస్లిం మైనారిటీలపై దాడులకు కారణమైందని బిలావల్ భుట్టో పేర్కొన్నారు. మైనారిటీ హక్కులను అణచివేత భారత్‌లో కొనసాగుతోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. మైనారిటీలపై ఒక పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

ఒకప్పుడు లౌకికదేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు హిందూ ఆధిపత్య దేశంగా మారుతోందని వ్యాఖ్యానించారు. గో సమస్యను అడ్డుగా పెట్టుకుని ముస్లింలపై దాడులు సాగుతున్నాయని చెప్పారు. భారత్‌ను ఇస్లామోఫోబియా వెంటాడుతోందని చెప్పారు. ముస్లింలపై విద్వేష భావజాలంతో నడిచే భారతీయ జనతా పార్టీ-ఆర్ఎస్ఎస్ పాలన ఇస్లామిక్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముస్లింలపై దాడులకు హిందుత్వ భావజాలం ఓ పెట్రోల్‌గా ఉపయోగపడుతోందని ఆరోపించారు.