బెండపూడి అడ్రస్‌ కోసం గూగుల్ సెర్చ్ – ఆస్ట్రేలియా నుంచొచ్చిన టీచర్: జగన్ సర్కార్‌పై

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల ఖ్యాతి.. ఖండాంతరాలు దాటింది. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్‌ను ప్రపంచదేశాలు ప్రశంసించాయి. భారత్‌లోని అమెరికా హైకమిషనర్ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెండపూడి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని ముగ్ధులయ్యారు. అమెరికన్ విద్యార్థులతోనూ ప్రతి ఆదివారం డిబేట్స్‌లో పాల్గొంటోన్నారు.

ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆమె పేరు వివియాన్. విద్యార్థులు ఇంగ్లీష్‌పై సాధించిన పట్టు, వారు మాట్లాడే విధానాన్ని యూట్యూబ్‌లో చూసి తాను ఆశ్చర్యపోయానని, స్వయంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో బెండపూడికి వచ్చినట్లు చెప్పారు. స్టూడెంట్స్‌తో మమేకం అయ్యారు. వారితో చాలా విషయాలపై మాట్లాడారు. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్థాయిలో ఇంగ్లీష్‌పై పట్టు సాధించడాన్ని తాను ఇదివరకెప్పుడూ చూడలేదని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న నాడు-నేడు పథకం గురించి బెండపూడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అమలు చేస్తోన్న లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్ తీరుతెన్నులపై విద్యార్థులు ఆమెకు వివరించారు. లెర్న్ ఎ వర్డ్ ఎ డే కార్యక్రమం కింద రోజుకు అయిదు పదాల చొప్పున నేర్చుకున్నామని. వంద రోజుల్లో 1,500 పదాలు నేర్చుకునే విధంగా ఒక ఫార్మాట్‌ రూపొందించారని చెప్పారు. ప్రతి రోజు ఉదయం స్కూల్‌ అసెంబ్లీలో తొలి 10, 15 నిమిషాలు ఈ పదాలపై ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదివరకు ఆమెరికా హైకమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు బెండపూడి విద్యార్థులు చెప్పారు. అమెరికన్ స్టూడెంట్స్‌తో ప్రత్యేకంగా డిబేట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు టీచర్లు వివియాన్‌కు వివరించారు. అట్లాంటా, జార్జియాల్లోని వివిధ పాఠశాల విద్యార్థులు, వారి స్నేహితులతో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆన్‌లైన్‌లో డిబేట్స్ సాగేవని తెలిపారు. పాఠశాలలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్ధులు అమెరికన్‌ స్లాంగ్‌లో అద్భుతంగా మాట్లాడుతున్నారని వివియాన్‌కు చెప్పారు.