బీజేపీ టార్గెట్‌గా బిగ్ స్కెచ్: పెట్రోల్ బాంబుతో: అట్టుడుకుతున్న సిటీ

చెన్నై: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడొచ్చనే కారణంతో పీఎఫ్ఐ) కార్యాలయాలపై దాడులు సాగిస్తోన్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం ఇందులో జోక్యం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలోతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో దాడులు చేశారు.

ఈ సందర్భంగా 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. అత్యధికంగా కేరళలో 22 మంది పీఎఫ్ఐ సభ్యులు అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో 20 మంది చొప్పున, తమిళనాడు-10, అస్సాం- 9, ఉత్తరప్రదేశ్‌-8, ఏపీ-5, మధ్యప్రదేశ్‌-4, ఢిల్లీ, పుదుచ్చేరిలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ, ఈడీ అధికారులు. దీనితో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై నిషేధం విధించేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య తమిళనాడులో కలకలం చెలరేగింది. కోయంబత్తూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబును విసిరాడు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీన్ని ఉగ్రవాద చర్యగా ఆరోపించారు.

వీకేకే మీనన్ రోడ్డులో గల వద్ద ఉన్న బీజేపీ కార్యాలయ ఆవరణలో పెట్రోల్‌ నింపిన బాటిల్‌ విసిరినట్లు పోలీసులు నిర్ధారించారు. బీజేపీ కార్యాలయం సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలోని ఫుటేజీలో ఇది రికార్డయింది. రోడ్డుకు అవతలివైపు నుంచి బాటిల్ వచ్చి కార్యాలయం ఆవరణలోకి పడిపోవడం కనిపించింది. మంటలు చెలరేగుతున్న ఈ బాటిల్‌ను ఎవరు విసిరారనేది కెమెరాలో రికార్డ్ కాలేదు. ఈ ఘటనపై కాటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సమాచారం అందిన వెంటనే ఇన్‌స్పెక్టర్ ఎస్ లత, ఫోరెన్సిక్‌ నిపుణులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పెట్రోల్ నింపిన బాటిల్‌ను పరిశీలించారు. బాటిల్‌కు నిప్పంటించలేదని తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శలు చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యాలయం ఎదుట గుమిగూడారు. గాంధీపురంలో రోడ్డులో బైఠాయించారు. ఈ ఘటన తరువాత కొద్దిసేపటికే రెండో దాడి ఒప్పనకర ప్రాంతంలోని మారుతీ హోల్‌సేల్ క్లాత్ స్టోర్‌పై జరిగింది.

షోరూమ్ ముందు పెట్రోల్ నింపిన బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. అది పేలకపోవడం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదు.
ఈ రెండు దాడుల తరువాత పోలీసులు కోయంబత్తూరు నగరంలో పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వందలాది మంది పోలీసులను నగర వ్యాప్తంగా మోహరించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద ప్రమేయం ఉందని కోయంబత్తూరు బీజేపీ కార్యకర్త నందకుమార్ చెప్పారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.