బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్.. పోటీ అక్కడ నుండేనా? యాక్టివ్ పాలిటిక్స్ అందుకేనా!!

తెలంగాణ రాష్ట్రంపై బలంగా ఫోకస్ చేస్తున్న బిజెపి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బిజెపి ఇప్పటినుండే బండి సంజయ్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు ప్రత్యేక దృష్టిని సారించడం కూడా తెలంగాణపై బీజేపీ పట్టు సాధించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో బిజెపి వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థులు ఎవరు? ఎవరిని ఎక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దింపాలి? అనే విషయంపై ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది.

తాజాగా ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ కు పార్టీలో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా, వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఆమెను దింపాలని బిజెపి భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు జీవిత రాజశేఖర్ అనేక పార్టీలలో పని చేసినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల లో పాల్గొనలేదు. అయితే ఇప్పుడు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జీవిత రాజశేఖర్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఉన్నారు. మహిళా మంత్రి నిర్మల సీతారామన్ ఇన్చార్జిగా ఉన్న నియోజకవర్గంలో మరో మహిళ కే అవకాశం ఇస్తారని, జీవిత రాజశేఖర్ కు అక్కడ అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ఇటు పార్టీల్లోనూ అంతర్గతంగానూ చర్చ జరుగుతుంది. సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీవిత-రాజశేఖర్ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవిత రాజశేఖర్ కు అక్కడ నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే జీవిత-రాజశేఖర్ రాజకీయాలలో కాస్త యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనడంతో పాటు జీవిత రాజశేఖర్ కరీంనగర్లో ఆయన చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జీవిత రాజశేఖర్ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. అధికారం చేపట్టాక ముందు తెలంగాణ ఉద్యమానికి ముందు కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని? ఇప్పుడు కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని అంటూ జీవిత రాజశేఖర్ కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పై కూడా హైదరాబాదులోని క్లబ్బుల్లో, పబ్బుల్లో వాటాలు ఉన్నాయని జీవిత రాజశేఖర్ టార్గెట్ చేస్తున్నారు.

మొత్తానికి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని, ప్రత్యక్ష రాజకీయాలలో తన సత్తా చాటాలని తహతహలాడుతున్న జీవితారాజశేఖర్ కు మరి ఆ ఆశ తీరుతుందా? ఎంపీగా పోటీ చేయడానికి ఆమెకు ఒక అవకాశం దొరుకుతుందా? బీజేపీకి జీవితా రాజశేఖర్ ఒక బలంగా మారతారా? జహీరాబాద్ నుండి అవకాశం ఇస్తే సత్తా చాటుతారా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే ఈ విషయంపై పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ మాట్లాడకపోవటం గమనార్హం.