బతుకమ్మ చీరలు నచ్చకుంటే తీసుకోకండి.. కానీ ఆ పని కూడా చెయ్యండి: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ పండుగ సంబరాలపై, దసరా ఉత్సవాలపై వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చీరలను ఎవరైనా తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

బతుకమ్మ సందర్భంగా ఇస్తున్న చీరల రేటు ఎంత అని ఆలోచించ వద్దని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ ఓ తండ్రిగా, అన్నగా ఇస్తున్న కానుకగా భావించాలని సూచించారు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దని, అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న రైతుబంధు మిగతా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకూడదు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం వరంగల్ పరిధిలో ఆరు చోట్ల ఉత్సవాల నిర్వహణలో కొన్ని లోపాలు కనిపించాయని, ఈ దఫా ఎటువంటి లోపాలు కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. కోటి మందికి పైగా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ పైన, దసరా ఉత్సవాల నిర్వహణ పైన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్ గా స్పందించారు.

గతేడాది చాలామంది, చాలా చోట్ల బతుకమ్మ చీరలను తగలబెట్టారు. ఏమాత్రం క్వాలిటీ లేని పాత చీరలు ఇచ్చారంటూ చీరలకు నిప్పుపెట్టి తమ నిరసనను తెలియజేశారు. కేసీఆర్ కుటుంబం ఎవరైనా ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడతారా అని ప్రశ్నించారు. కెసిఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా అంటూ నిలదీశారు. కటిక పేదరికం లో ఉన్నవారు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా మంచి బట్టలు కట్టుకుంటారు అని, కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్నామని చెబుతున్న చీరలు మరీ నాసిరకంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎవరైనా చీరలు తగలబెడితే సహించేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రేమతో ఇస్తున్న కానుకను తీసుకోవాలని సూచించారు. ఇష్టం లేని వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం తీసుకోవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.