బతికున్న మహిళను రికార్డుల్లో చంపేసి, భూమి బదిలీ: తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో మరో దుర్మార్గపు తహసీల్దార్ వ్యవహారం వెలుగుచూసింది. ఏకంగా ఓ మహిళను బతికుండగానే రికార్డుల్లో చంపేసి.. ఆమెకు సంబంధించిన భూమిని ఇతరులకు అక్రమంగా కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ విషయం సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాగా, ప్రాథమిక విచారణ అనంతరం ఈ వ్యవహారం బయటపడటంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు కలెక్టర్.

వివరాల్లోకి వెళితే.. రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సర్వే నెంబర్ 198లో 27 ఎకరాల 34 గుంటల భూమి ఉంది. గత సంవత్సరం ఆయన మరణించడంతో ఈ భూమిని భార్య శివమ్మ పేరిట ఫౌతీ చేయించుకున్నారు. భర్త మృతితో ఆమె హైదరాబాద్ లో ఉంటున్న కుమారుల వద్ద ఉంటోంది. అయితే, శివమ్మ భూమిపై ఆమె బంధువులు కన్నేశారు.

శివమ్మ చనిపోయిందంటూ ఆ భూమిని తన పేరిట మార్చాలంటూ హన్మంత్ రెడ్డి సోదరి స్లాట్ బుక్ చేసుకుంది. శివమ్మ పేరున ఉన్న భూమి మార్చుకునేందుకు హన్మంత్ రెడ్డి మరణ ధృవీకరణ పత్రం తీసుకుని బతికున్న భార్య పేరున ఉన్న భూమినంతా తహసీల్దార్ రాజయ్య, రెవెన్యూ అధికారులు సెప్టెంబర్ 10న అంజమ్మ పేరున మార్చేశారు.

ఈ విషయం తెలసుకున్న బాధితురాలు శివమ్మ.. సంగారెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించి ఆధారాలు సమర్పించింది. అనంతరం అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ రాజయ్యతోపాటు అంజమ్మపై బాధితురాలు శివమ్మ రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రాజయ్యపై రాయికోడ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

భూమి మరొకరి పేరున పట్టా చేశారంటూ ముందుగా బాధితురాలు సంగారెడ్డి
కలెక్టర్ శరత్‌ను ఆశ్రయించగా.. ఇప్పటికే ఆయన విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో తహసీల్దార్ అక్రమం బయటపడటంతో రాజయ్యను వెంటనే సస్పెండ్ చేశారు.