దుర్గాదేవి మండపాలపై శిలువ – బొమ్మలు..!!

కోల్‌కత: ఇంకో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల సంరంబం ఆరంభం కాబోతోంది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు దసరా పండగను జరుపుకోవడానికి సిద్ధమౌతోన్నాయి. పలు రాష్ట్రాల్లో అమ్మవారి మండపాలు వెలుస్తోన్నాయి. తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. ఈ తొమ్మిది రోజుల పాటు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనే అంచనాలు ఉన్నాయి.

పశ్చిమబెంగాల్‌లో దేవీ నవరాత్రులు మరింత కోలాహలంగా సాగుతాయి. కోల్‌కత దక్షిణేశ్వర్ కాళిక అమ్మవారి ఆలయంలో ఆకాశాన్నంటేలా ఈ పండగను నిర్వహిస్తుందక్కడి ప్రభుత్వం. 1855లో కాళీమాత భక్తురాలు రాణి రష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలో ఉన్న అన్ని కాళీమాత ఆలయాలన్నింట్లోనూ ఇదే అత్యంత ప్రసిద్ధి చెందినది. భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శక్తిపీఠాల్లో ఇదీ ఒకటి. అమ్మవారి కుడి పాదం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. అమ్మవారు రౌద్రరూపంలో కనిపిస్తారిక్కడ.

అదే సమయంలో కోల్‌కతలో వీధివీధినా అమ్మవారి మండపాలు వెలుస్తుంటాయి. హైదరాబాద్‌లో ఏ రకంగా వినాయకుడి మండపాలను వివిధ రూపాల్లో నెలకొల్పుతుంటారో.. కోల్‌కతలో అదే తరహాలో ఏర్పాటు చేస్తుంటారు భక్తులు. ఈ సారి వాటికన్ సిటీ తరహాలో ఓ మండపం వెలిసింది. వాటికన్ సిటీ ఎలా ఉంటుందో.. అచ్చంగా దాన్ని ప్రతిబింబించేలా ఈ మండపాన్ని నెలకొల్పారు. దీన్ని ఏర్పాటు చేయడానికి 60 రోజుల సమయం పట్టింది.

శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ వేడుకలను కూడా ఈ స్పోర్ట్స్ క్లబ్ జరుపుకొంటోంది. దీన్ని పురస్కరించుకుని దుర్గమ్మ అమ్మవారి మండపాన్ని వాటికన్ సిటీ థీమ్‌తో ఏర్పాటు చేసినట్లు శ్రీభూమి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధి సుజిత్ బోస్ చెప్పారు. వాటికన్ సిటీని అందరూ సందర్శించలేరని, అలాంటి వారి కోసమే ఈ థీమ్‌తో ఈ మండపాన్ని నెలకొల్పినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

అచ్చంగా వాటికన్ సిటీని పోలి ఉండేలా అమ్మవారి మండపాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఆ నగరాన్ని చూడలేని వారి కోరిక ఈ విధంగా నెరవేర్చుతున్నామని చెప్పారు.

ఈ పండల్‌ను తయారు చేయడానికి 60 రోజులు పట్టిందని, 100 మందికి పైగా కళాకారులు దీన్ని తయారు చేశారని అన్నారు. గత ఏడాది బుర్జ్ ఖలీఫాను పోలీన దుర్గా మండపాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.