తెలుగుదేశం పార్టీతో పొత్తుపై నివేదిక పంపించిన బీజేపీ?

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతాపార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లను బీజేపీవైపు మళ్లించగలిగితే ఇరు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని, తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనేది ఆ వార్తల్లోని సారాంశం. దానికి ప్రతిఫలంగా ఏపీలో జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఇలా అనేకరకాలుగా వచ్చిన వార్తలకు తెలంగాణ బీజేపీ చెక్ పెట్టింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఆంధ్రా అనే బూచిని కేసీఆర్ మళ్లీ చూపించే అవకాశం కనపడుతోంది. సెంటిమెంట్ ను రాజేసి పబ్బం గడుపుకునే రీతిలో అధికార పార్టీ ఉంటుందని, ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. ప్రజలంతా ఒకేతాటిపైకి వచ్చి కేసీఆర్ కు ఓట్లేసే ప్రమాదం ఉందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నివేదిక పంపించినట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తువల్ల ఇదే జరిగిందని ఉదాహరణగా గుర్తుచేసింది.

ఇది ఒకరకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం మద్దతుతో ఎన్నికలకు వెళితే కలిగే అదనపు ప్రయోజనాలేంటనేది 2019లో చంద్రబాబు గ్రహించగలిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈసారి ఎన్నికలకు తమతో పొత్తు పెట్టుకోకపోయినా పర్వాలేదని, అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలని బాబు కేంద్రాన్ని కోరుతున్నారు.

బీజేపీతో పొత్తు లేకపోయినా జనసేనతో పొత్తు కుదిరే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పొత్తువల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని, కాకపోతే అండగా ఉంటుందనే ఉద్దేశంతో తాము సుముఖంగా ఉన్నామని తెలిపాయి. అయితే తెలంగాణ బీజేపీ ఇచ్చిన నివేదికతో పొత్తుకు అవకాశాల్లేవనేది స్పష్టమవడంతో బీజేపీ లేకుండా టీడీపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది.