తెలంగాణాపై కేంద్రం ఫోకస్: వరంగల్ లో రెండురోజులపాటు కేంద్రమంత్రి పర్యటన; బీజేపీ శ్రేణుల్లో జోష్!!

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను గద్దె దించాలని బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుంది. రోజుకో రకమైన వ్యూహాలతో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రజా సంగ్రామ పాదయాత్రలకు కేంద్రమంత్రులను తెలంగాణాకు రప్పిస్తూ తెలంగాణాలో పట్టు సాధించటం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలతోనూ బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. అంతేకాదు కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తూ, ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు రాత్రులు ఉంటూ, నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చెయ్యటం మాత్రమే కాకుండా కేంద్ర పథకాల అమలు తీరును కూడా పరిశీలిస్తూ తెలంగాణా ప్రభుత్వ పాలనపై దాడిని కొనసాగిస్తున్నారు. బీజేపీ ‘లోక్‌సభ ప్రవాస్‌ యోజన’ వ్యూహంలో భాగంగా రాష్ట్రాన్ని ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ నాలుగు క్లస్టర్లుగా విభజించి కేంద్రమంత్రుల పర్యటనలను కొనసాగిస్తున్నారు.

కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం ఖోడాభాయ్ రూపాలా ఆదిలాబాద్ క్లస్టర్‌కు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి హైదరాబాద్ క్లస్టర్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ క్లస్టర్ బృందానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే నాయకత్వం వహిస్తుండగా, ఈశాన్య ప్రాంత సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వరంగల్ క్లస్టర్‌లో పార్టీ కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఉన్న సమయంలో చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని రాష్ట్రంలో ఏ విధంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలి అన్నదానిపై వారు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇక ఇందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మరియు సహకార శాఖ సహాయ మంత్రి బీ.ఎల్ వర్మ నేడు పర్యటించనున్నారు. పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. నేడు ఉదయం వడ్డేపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకోనున్నారు. ఆపై హరిత హోటల్ లో నిర్వహించనున్న వరంగల్ బీజేపీ లోక్సభ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చెయ్యనున్నారు.

అనంతరం మధ్యాహ్నం వరంగల్ శివ నగర్ లోని పద్మశాలి భవన్ కు చేరుకుని అక్కడ వరంగల్ లోక్సభ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొననున్నారు. తరువాత వరంగల్ మహేశ్వరి గార్డెన్స్ లో వీధి వ్యాపారులతో కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ మాట్లాడనున్నారు. రేపు కూడా ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపధ్యంలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కేంద్రమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కేంద్రమంత్రి పర్యటనలో భాగం తీసుకోవటానికి రెడీ అవుతున్నారు.

వరుసగా జాతీయ నాయకుల పర్యటనలతో, బిజెపి ఫోకస్ తెలంగాణ రాష్ట్రంపై ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కృషి చేస్తున్నట్టు ప్రజాక్షేత్రంలో చూపించే ప్రయత్నం చేస్తోంది బిజెపి అగ్రనాయకత్వం. మొత్తానికి బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి వినూత్న వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళుతుంది. కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.