టీ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు – విచారణకు రావాలంటూ..!!

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్న 10న విచారణకు రావాలని నిర్దేశించింది. నేషనల్ హెరార్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటుగా రాహుల్ గాంధీ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు.సోనియా – రాహుల్ ను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ విచారణ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసలకు దిగారు. అయితే, ఇప్పుడు తెలంగాణల కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి తో పాటుగా ఉమ్మడి ఏపీలో మంత్రులుగా పని చేసిన ఇద్దరు నేతలు, ఒక ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందులో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటుగా మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు నేతలను వచ్చే నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. తమకు ఇంకా నోటీసులు అందలేదని, అందితే విచారణకు హాజరవుతామని షబ్బీర్ అలీ చెప్పారు. నేషనల్ హెరాల్డ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే సోనియాతో పాటుగా రాహుల్ ను విచారించింది. కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ అయిన ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది.

అయినప్పటికీ ఆ పత్రిక పునరుద్ధరించలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్‌లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)‌కు బదలాయించారు. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్‌కు బదలాయించింది. ఏజెఎల్ వాటా మొత్తాన్ని వైఐఎల్‌కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం చట్ట విరుద్దంగా జరిగిదంటూ సుబ్రమణ్య స్వామి ఢిల్లీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇప్పుడు ఆ నిధుల వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెందిన సంస్థల నుంచి నగదు బదిలీ అయినట్లుగా ఈడీ విచారణలో గుర్తించినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వారిని విచారణకు పిలిచారని సమాచారం. షబ్బీర్ అలీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. అయితే, ఈ నోటీసుల వ్యవహారం పైన పార్టీ నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.