టిక్‌టాక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ప్రియురాలితో భర్తకు పెళ్లి చేసిన మొదటి భార్య

చిత్తూరు: ఇదో వింత ప్రేమ కథా పెళ్లి చిత్రం. సినిమాలోని ట్విస్టులకు ఏ మాత్రం తగ్గకుండా సాగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చివరకు ఒక్కడిని ఇద్దరు ప్రియురాళ్లు భర్తగా పంచుకున్నారు. వీరి ప్రేమకు టిక్‌టాక్ కారణం కావడం గమనార్హం. ఇద్దరు ప్రియురాళ్లను అతడు టిక్‌టాక్ వేదికగానే కలుసుకున్నాడు.

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన యువకుడు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇతనికి విశాఖపట్నంకు చెందిన ఓ యువతి టిక్‌టాక్‌లోనే పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఏమైందో ఏమో గానీ, ఆ యువకుడు టిక్‌టాక్‌లో కొంత కాలం కానరాలేదు. దీంతో ఆమె అతడి కోసం వేచిచూస్తోంది.

అయితే, ఆ యువకుడు మాత్రం కడపకు చెందిన మరో యువతి ప్రేమలో పడ్డాడు. అది కూడా టిక్‌టాక్ పరిచయంతోనే కావడం గమనార్హం. ఈ క్రమంలో వీరిద్దరూ పలుమార్లు కలుసుకున్నారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇద్దరూ కలిసి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ తమ కాపురాన్ని సాఫీగా సాగిస్తున్నారు.

ఇది ఇలావుండగా, మొదటగా పరిచయమైన యువతి.. ఈ యువకుడి కోసం ఎదురుచూసి చూసి.. చివరకు అతడ్ని కలిసేందుకు వచ్చింది. అయితే, అప్పటికే అతనికి పెళ్లయిందని తెలిసి నిరాశకు గురైంది.అయినా, తాను మాత్రం అతడ్నే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో ప్రేమికుడి భార్యతో ఆమె మాట్లాడింది.

తాము ముందే ప్రేమించుకున్నామని, అనుకోకుండా దూరమయ్యామని అతడి భార్యకు తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో కరిగిపోయిన అతడి భార్య.. తన భర్తతో ఆమెకు పెళ్లి చేసేందుకు నిర్ణయించింది. ప్రియురాళ్ల మధ్య సయోధ్య కుదరడంతో అతడు కూడా ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. దీంతో భార్య సమక్షంలో మొదటి ప్రియురాలికి మూడు ముళ్లు వేశాడు ఈ టిక్‌టాక్ హీరో. కాగా, స్థానికగా ఈ వివాహం హాట్ టాపిక్‌గా మారింది.