జూ. ఎన్టీఆర్‌‌పై భగ్గుమంటున్న నందమూరి ఫ్యాన్స్.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జగన్‌కు షర్మిలా షాక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. కాకపోతే స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్‌పై భగ్గుమంటున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఏపీలో తాజా అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. ఆంధ్రాలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వేసింది. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో హెల్త్ యూనివర్సిటీ పేరు ఖారారు చేసింది. ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైఎస్ఆర్ పేరును చేర్చడంపై భిన్నస్వరాలు వినిపించాయి.

ఎన్టీఆర్ పేరు తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని తగ్గించదు అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక అదే ట్విట్‌లో విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకొన్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జాపకాలను చెరిపి వేయలేరు అని జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అటు ఏపీలో అధికార పక్షాన్ని నొప్పించకుండా.. ఇటు తమ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరిని కీర్తిస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చుతారా? ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఏమిటి? ఆయన ప్రజలకు, సినీ రంగానికి చేసిన విలువైన సేవలతో వైఎస్ఆర్‌ను ముడిపెడుతారా అని సోషల్ మీడియాలో కామెంట్లు భారీగా వినిపించాయి. ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.

ఎన్టీఆర్‌ను వైఎస్ఆర్‌ను ఒకే గాటున కట్టడంపై టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యాన్స్ భగ్గమంటున్నారు. తమ మనోభావాలను జూనియర్ ఎన్టీఆర్ కించపరిచారు అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే టీడీపీ వ్యతిరేకులు మాత్రం.. ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది. భవిష్యత్‌లో పాలిటిక్స్‌లోకి వస్తారు. అయితే చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారడం ఇష్టం లేకే ఇలా బ్యాలెన్స్‌గా కామెంట్స్ చేశారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్ జగన్ సోదరి షర్మిలా రెడ్డి షాకిచ్చారు. యూనివర్సిటీ పేరు మార్చకూడదు. దాని వల్ల ఆయనకు, సంస్థకు ఉన్న విలువ కోల్పోతుంది. ఒక పేరు అంటూ పెట్టారు. ఆ పేరును తరతరాలు కొనసాగిస్తే గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. దాంతో ఈ గందరగోళాన్ని కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉండేది కాదు అని వైఎస్ షర్మిల కామెంట్ చేయడం మరో చర్చకు దారితీసింది.