జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటపై తెలంగాణా సర్కార్ సీరియస్, నోటీసులిస్తామన్న అడిషనల్ సీపీ!!

జింఖానా గ్రౌండ్స్ లో టి20 టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే బ్లాక్ లో టికెట్లు అమ్మారు ఉన్న ఆరోపణలపై తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సీరియస్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్లో టిక్కెట్లు అమ్మారని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా టికెట్ల వ్యవహారంపై, టిక్కెట్ల విక్రయాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ హెచ్సిఏను ఆదేశించింది.

క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం పై పూర్తి సమాచారంతో రావాలని పేర్కొంది. ఇదిలా ఉంటే మ్యాచ్ టికెట్ల వివరాలతో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ రావాలని పేర్కొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, టికెట్ల కేటాయింపు పై వివరణ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ఈరోజు ఉప్పల్ స్టేడియం ను పరిశీలించిన మంత్రి ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని పేర్కొన్నారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తే సహించబోమని తేల్చి చెప్పారు.

ఇక మరోవైపు జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట పై మాట్లాడిన పోలీసులు తొక్కిసలాటలో మహిళ మరణించలేదని స్పష్టం చేశారు. జింఖాన గ్రౌండ్స్ వద్ద మీడియాతో మాట్లాడిన అడిషనల్ సిపి చౌహన్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం కోసం హెచ్సీఏ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

టికెట్ల విక్రయం కోసం ఏర్పాట్లు చేస్తే పరిస్థితి మరో విధంగా ఉండేదని ఆయన తెలిపారు. తొక్కిసలాటకు కారణమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇక పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని టికెట్ల విక్రయాలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగలేదని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు తొక్కిసలాట జరిగి ఎంతో మంది గాయాలపాలయ్యారు అని పేర్కొన్నారు.