జింఖానా గ్రౌండ్స్ టీ20 తొక్కిసలాట: అజారుద్దీన్ తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడుకేసులు నమోదు

ఈనెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టి20 భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఈ మ్యాచ్ ను కళ్లారా స్టేడియం నుండి చూడటం కోసం హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు అనేక కష్టాలు పడ్డారు. జింఖానా మైదానం లో టిక్కెట్ల విక్రయం జరుగుతుందన్న ఆశతో హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి టికెట్ల కోసం వచ్చిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టార్గెట్ అయింది.

టికెట్ల కోసం వచ్చే వారికి సరైన వసతులను కల్పించకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో పోలీసులు హెచ్సీఏ పై కేసు నమోదు చేశారు. టికెట్లను బ్లాక్ మార్కెట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో అభిమానులకు సౌకర్యాలు కల్పించలేకపోవడం వంటి ఆరోపణలతో హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తోపాటు హెచ్సీఏ సభ్యులపై బేగంపేట పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్ల విక్రయానికి వేదిక కాగా, టికెట్ల కోసం క్యూలైన్లో నిలబడిన అభిమానులు, పోలీసులు లాఠీఛార్జి తో, తొక్కిసలాట తో గాయపడిన క్రమంలో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా, జింఖానా మైదానంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, టిక్కెట్ల విక్రయాల విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందజేయకపోవడం, బ్లాక్ టికెట్ ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం వంటి అంశాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తెలిపారు.

వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు సరైన వసతులు సమకూర్చకపోవటం, టికెట్ల విషయంలో చోటుచేసుకున్న గందరగోళమే తొక్కిసలాటకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడం ప్రారంభించామని చౌహాన్ చెప్పారు. టికెట్ల విక్రయాల సమయంలో కనీసం పోలీసులతో కూడా సమన్వయం చేసుకోకపోవడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తోపాటు హెచ్సీఏ సభ్యులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.