జగన్, చంద్రబాబు ఎత్తుకు పైఎత్తులు-అమరావతి యాత్ర-అసెంబ్లీ బిల్లు-ఎన్టీఆర్ పేరు మార్పు !

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ తెరవెనుక కదుపుతున్న పావులతో అప్రమత్తమైన టీడీపీ రైతులతో పాదయాత్ర పెట్టిస్తే.. దానికి కౌంటర్ గా మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించి డైవర్షన్ పాలిటిక్స్ కు వైసీపీ తెరదీసింది. అయితే బిల్లు పెట్టే సాహసం చేయలేక సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్సార్ గా మార్చేసింది. దీంతో ఇప్పుడు వైసీపీ,టీడీపీ పోరు మరో స్ధాయికి చేరుకుంది.

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎన్నికలకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ ఇచ్చేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో పాత, కొత్త రాజకీయాలు అకస్మాత్తుగా తెరపైకి వచ్చేస్తున్నాయి. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుచేయలేని ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తెస్తుంటే టీడీపీ అమరావతి పాదయాత్రతో ముందుకొచ్చింది. దీనికి కౌంటర్ గా మొదలైన రాజకీయం ఇప్పుడు రకరకాల మలుపులు తీసుకుంటోంది.

అమరావతి రైతులు ఉత్తరాంధ్రలోని అరసవిల్లికి చేపట్టిన మహాపాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొదట్లో ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో రైతులు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇదో కంటగింపుగా మారింది. అమరావతి పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణిస్తూ సీఎం, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయినా రైతులు ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల్లోనే తమ యాత్ర కొనసాగిస్తుండటంతో ఈ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో ఈ యాత్ర అనకాపల్లి జిల్లాకు చేరుకున్న తర్వాత వైసీపీ తమ దాడి ముమ్మరం చేసే అవకాశముంది.

అమరావతి పాదయాత్రను డైవర్ట్ చేసేందుకేనా అన్నట్లు వైసీపీ మంత్రులు అమర్నాథ్, రోజా వంటి వారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతున్నట్లు లీకులు ఇచ్చారు. దీంతో అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభుత్వం తొలిరోజే మూడు రాజధానుల చర్చ చేపట్టడంతో హఠాత్తుగా బిల్లు ప్రవేశపెడుతుందా అన్న చర్చ సాగింది. కానీ చివరికి ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో మరోసారి సుదీర్ఘ చర్చతో సరిపెట్టేసింది. దీంతో రాజధానుల బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదన్న సందేహాలు మొదలయ్యాయి. అదేసమయంలో సుప్రీంకోర్టులో హైకోర్టు గతంలో ఇచ్చిన అమరావతి తీర్పును సవాల్ చేసింది.

ఎప్పుడైతే అమరావతి పాదయాత్రను డైవర్ట్ చేసేందుకు వైసీపీ సర్కార్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లంటూ హడావిడి చేసి విఫలమైందో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఈ విమర్శల నుంచి జనం దృష్టి మళ్లించేందుకా అన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ పేరుతో మార్చేస్తూ బిల్లును అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి నెగ్గించుకున్నారు. దీనిపై విపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతో అమరావతి పాదయాత్రే కాదు అన్ని విషయాలు ఒక్కసారిగా సైడైపోయాయి. ఇక చివరికి అందరి చర్చా ఎన్టీఆర్ పేరుమార్పుమీదే. దీనికి ప్రభుత్వం పలు కారణాలు చెప్పుకున్నా అవి అంత సమర్ధనీయంగా కనిపించపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా వైఎస్ జగన్, చంద్రబాబు మధ్యసాగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ లో ఇవి భాగంగా మాత్రమే మిలిగిపోతున్నాయి.