చంద్రబాబు గడ్డపై జగన్: రూ.4,949.44 కోట్లు విడుదలకు రంగం సిద్ధం

చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవ్వాళ ఆయన కుప్పం గడ్డపై అడుగు పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడతగా నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కుప్పం పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.

కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ నియోజకవర్గం కావడం, ఈ స్థానం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

45 సంవత్సరాలు నిండిన అర్హులైన మహిళలకు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో విడతలో 18,750 చొప్పున 75,000 రూపాయలను బదిలీ చేస్తుంది. ఇదివరకు రెండుదఫాల్లో ఈ నిధులు విడుదలయ్యాయి. మూడో విడత నిధులను వైఎస్ ఇవ్వాళ విడుదల చేయనున్నారు. దీనికోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2020లో 24,00,111 మంది కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 26,39,703కు చేరింది. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ 4,949.44 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. దీనితో కలిపి ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం అందజేసిన మొత్తం 14,110.52 కోట్ల రూపాయలకు చేరుతుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

తన కుప్పం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం 66 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. సీసీ రోడ్ల నిర్మాణం, స్ట్రీట్ లైటింగ్.. వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ నిధులను విడుదలు అయ్యాయి.