గొర్రెలమంద నుండి తప్పిపోయిన గొర్రెలు; గొర్రెల కాపరి షాకింగ్ పని చేశాడుగా!!

ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అమ్మ కోప్పడిందని, ఇంట్లో మొబైల్ అడిగితే కొనివ్వలేదని, ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఆయా కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉన్న వాళ్ళే కాకుండా, పెద్దవాళ్లు కూడా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది.

ఇక తాజాగా కేవలం మూడు గొర్రెలు కనిపించలేదు అన్న కారణంతో ఒక గొర్రెల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. గొర్రెల మందలో కొన్ని గొర్రెలు కనిపించకుండా పోవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగింది. చెన్నారావుపేట మండలం కటయ్య పల్లికి చెందిన కోరే కొమురయ్య గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. గొర్రెలను మేపుతూ వెళ్ళిన క్రమంలో మూడు రోజుల క్రితం గొర్రెల మంద నుండి మూడు గొర్రెల కనిపించకుండా పోవడంతో మనస్తాపం చెందాడు.

గొర్రెల కోసం ఎంత వెతికినా గొర్రెల ఆచూకీ లభించకపోవడంతో ఆవేదనకు గురైన కొమురయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరి కొమురయ్య కేవలం మూడు గొర్రెలు కనిపించలేదని చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకోవడంతో కొమురయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు గొర్రెల కంటే తన ప్రాణం విలువైనదని గుర్తించలేకపోయిన కొమురయ్య ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఈ వార్త విన్న వారిని షాక్ కు గురి చేస్తుంది. గొర్రెల కోసం ప్రాణాలు తీసుకుంటారా అని స్థానికులు క్షణికావేశంలో కొమురయ్య తీసుకున్న నిర్ణయంపై చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఆడపిల్ల పుడుతుంది ఏమో అన్న ఆందోళనతో ఓ గర్భిణీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేసి నిండు గర్భిణి ప్రాణాలు తీసుకుంది. మహబూబ్ నగర్ మండలం గాజులపేటకు చెందిన 25 సంవత్సరాల మౌనిక ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని తీవ్ర ఆందోళనతో, క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి అనంతలోకాలకు చేరుకుంది.

ఇక ఇటువంటి ఆత్మహత్యల ఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుందని అర్థం చేసుకోలేక పోతున్న ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక పెరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో, చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేలా వారిలో మానసిక స్థైర్యం పెంపొందించేలా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.