గవర్నర్ తో చంద్రబాబు భేటీ-ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చొద్దని వినతి…

విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ, మండలిలోనూ బిల్లులు కూడా ఆమోదించేసింది. ఇప్పుడు గవర్నర్ సంతకం కూడా చేసేస్తే అది చట్టంగా కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తో విపక్ష నేత చంద్రబాబు భేటీ అయ్యారు.

టీడీపీ నేతలతో కలిసి విజయవాడలోని గవర్నర్ నివాసం రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే ఇలా మార్చిందని గవర్నర్ కు చంద్రబాబు తెలిపారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు .. గవర్నర్ తో చర్చించిన అంశాల్ని మీడియాకు వెల్లడించారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు.

1986లో ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీని స్థాపించారని, తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ కూడా తీసుకు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్‌రెడ్డి వాస్తవాల్ని విస్మరించి దుర్మార్గంగా మాట్లాడుతున్నారనన్నారు. సీఎం జగన్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనని, హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని,హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు.

మరోవైపు ఏపీలో జగన్‌ పాలనలో 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాత్రి వాళ్ల నాన్న వైఎస్సార్ ఆత్మతో మాట్లాడి హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కంటే వైఎస్‌ఆర్‌ ఎలా గొప్ప వ్యక్తని ఆయన నిలదీశారు. తండ్రీ కొడుకులు కలిపి రాష్ట్రానికి ఎన్ని మెడికల్‌ కాలేజీలు తెచ్చారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్‌ కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మించి దానికి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవాలని సూచించారు.