కుప్పం బీసీల సీటు – చంద్రబాబుది కాదు :పెన్షన్ పెంపు : వెన్ను పోటు – దొంగ ఓటు: సీఎం జగన్ ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రస్తుతం అందిస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకు ను రూ 2,500 నుంచి రూ 2,750కి పెంచుతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి ఇది అమలవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మూడు వేలకు పెంచే క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. కుప్పంలో ముఖ్యమంత్రి మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేసారు. కుప్పం ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు పైన సీఎం జగన్ ఫైర్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేసారు.

33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు కుప్పం నుంచి తాను కావాల్సింది తీసుకున్నారు, ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేయలేదని ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం ఆయనకు లేవంటూ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉంటూ కుప్పంలో కరువుకు పరిష్కారం చూపించలేదని ఆరోపించారు. కేంద్రంలో రాష్ట్రపతులను మార్చాను.. ప్రధానులను నియమించాను.. చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు తన నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీళ్లు తీసుకురాలేకపోయారంటూ ఫైర్ అయ్యారు. ప్రతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవటంలో అనుభవం గురించి కధలు కధలుగా చెప్పుకుంటారు. వెన్నుపోటు – దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నిలిచారంటూ ఫైర్ అయ్యారు. కుప్పం ప్రజలు ఒక్క సారి నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో 2019 తరువాత జరిగిన ఎన్నికల్లో చూపించారని సీఎం చెప్పుకొచ్చారు. విమర్శించారు.

బీసీలకు న్యాయం చేసామని భారీ డైలాగులు చెబుతున్నారని, ప్రతీ చోట బీసీలకు అన్యాయమే చేసారని ఆరోపించారు. కుప్పం బీసీల సీటు అని చెప్పుకొచ్చారు. బీసీలకు ఇవ్వకుండా సీటు చంద్రబాబు లాక్కున్నారని వ్యాఖ్యానించారు. కుప్పంను ఒక్క సారి కూడా టీడీపీ బీసీలకు ఇవ్వలేదని, ఇది బాబు మార్క్ సామాజిక న్యాయమని ఎద్దేవా చేసారు. బీసీలను వాడుకొని వదిలేస్తుదెవరో ఆలోచించాలని సీఎం సూచించారు. కుప్పంలో ప్రభుత్వ పథకాల ద్వారా రూ 1149 కోట్లు పంపిణీ చేసినట్లు సీఎం వివరించారు. భరత్ మీ బిడ్డ. ఎమ్మెల్సీగా ఇవన్నీ కుప్పం కోసం నాతో చేయించాడని, గెలిపిస్తే మంత్రిని చేస్తానని సభలో ప్రకటించారు. త్వరలో వంద కోట్ల నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మహిళలకు ఈ పథకం ద్వారా రూ 56,250 కోట్లు ఇప్పటి వరకు మహిళలకు అందించామని సీఎం వివరించారు. డీబీటీ ద్వారా అక్కా చెల్లమ్మలకు ఈ మూడేళ్లలో లక్షా పదహారు వేల కోట్లకు పైగా వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.

అన్ని రకాల సంక్షేమ పథకాల ద్వారా అన్ని కుటుంబాలకు నేరుగా డబ్బు లక్షా 71వేల 244 కోట్లు అందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎక్కడా అవినీతి లేకుండా, అర్హతే ప్రామాణికంగా అందిచామని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీ కాకుండా, ఇళ్ల పట్టాలు- ఇళ్ల నిర్మాణం.. ఇతర పథకాల ద్వారా 39 నెలల కాలంలో లక్షా 41 వేల కోట్లు అందించినట్లుగా చెప్పారు. రెండు రకాలుగా అందించిన సాయం చూసుకుంటే..మొత్తంగా ఈ 39 నెలల కాలంలో 3 లక్షల 12 వేల కోట్ల రూపాయాలు అందిచామని సీఎం వివరించారు. అమూల్ ఎంట్రీతో పాల సేకరణ ధర హెరిటేజ్ కూడా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్ అంటూ సీఎం జగన్ విమర్శించారు. నాడు – నేటి పాలనకు తేడా గమనించాలని..ఇది మీ ప్రభుత్వమంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.