కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై తేల్చేసిన రాహుల్ – గెహ్లాట్ పోటీ వేళ కీలక వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపైన రాహుల్ గాంధీ తన నిర్ణయం ప్రకటించారు. ఈ రోజునే 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రాహుల్ ను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలంటూ పలు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలు చేసాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ముందుకు సాగుతున్నారు. అటు అధ్యక్ష బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు అశోక్ గెహ్లాట్ .. శశి థరూర్ వరుసగా సోనియాతో భేటీ అయ్యారు. వీరిద్దరితో పాటు తాజాగా దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు.

గెహ్లాట్ తో పాటుగా శశి థరూర్ పోటీ పడటం ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అధ్యక్ష పదవికి నామినేషన్లకు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించిన రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ ఈ నెల 29 లోగా నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలో రాహుల్ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసారు. తాను అధ్యక్ష బరిలో లేనని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ అధ్యకుడు అంటే పదవి కాదని.. సైద్దాంతిక వ్యవస్థగా అభివర్ణించారు. ఒక విధంగా దేశానికి ప్రాతినిధ్యం వహించటమేనని వివరించారు. తన నిర్ణయాన్ని గతంలోనే చెప్పానని గుర్తు చేసారు. దీని ద్వారా తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదనే విషయాన్ని స్పష్టం చేసారు.

భావి భారతానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తారని విశ్లేషించారు. అదే సమయంలో ఉదయ్ పూర్ లో తీర్మానించిన విధంగా ఒక వ్యక్తికి ఒకే పదవి అంశాన్ని ప్రస్తావించారు. పరోక్షంగా అశోక్ గెహ్లాట్ కు సూచనగా భావిస్తున్నారు. రాహుల్ తాజా వ్యాఖ్యలతో ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

సోనియాగాంధీ వారసుడుగా రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోత్‌, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ మధ్య పోటీ నెలకొంది. దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలకనేతల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ తాను రేసులో ఉన్నానని చెబుతున్నా, ఎన్నికల బరిలో దిగటం సందేహం గానే కనిపిస్తోంది.

అశోక్ గెహ్లాట్ పేరుంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్.. వీటన్నింటికీ భిన్నమైన వ్యక్తి. ఆయన 2009లో కాంగ్రెస్​లో చేరారు. మాస్ లీడర్ కాకపోవడం బలహీనత. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపేంత వ్యక్తి కాదు. అంతకుమించి.. పార్టీలో విభేదాలు భగ్గుమన్న సమయంలో గాంధీ కుటుంబానికి వ్యతిరేక బృందంలో ఉన్నారు. జీ23 నేతలతో కలిసి సోనియాకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ ఇద్దరే బరిలో నిలిస్తే పార్టీ ఎవరికి మద్దతుగా నిలుస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. నామినేషన్ల సమయం ముగిసే వేళ, పార్టీ నుంచి ఎవరెవరు తుది రేసులో ఉన్నారనేది క్లారిటీ రానుంది.