ఒకే బాల్.. అభిమానులు క్లీన్ బౌల్డ్.. అజారుద్దీన్ సిక్సర్

టికెట్ల అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్ జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ప్రపంచవ్యాప్తంగా హెచ్ సీఏ పరువుతోపాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతింది. వాస్తవానికి ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయిన బీసీసీఐ సాధ్యమైంతవరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను దూరం పెట్టింది. ఎన్నాళ్లకో ఒక మ్యాచ్ ను ప్రకటించింది. ఆ మ్యాచ్ తో హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అభిమానులను బౌల్డ్ చేశాడు.

ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 55వేలు. మ్యాచ్ కు అనుమతించేది 34వేల మందిని మాత్రమే. అందులోను ఆటగాళ్లకు, స్పాన్సర్లకు 4500 టికెట్లు ఇచ్చారు. అమ్మాల్సిన టికెట్లు 29,500 ఉన్నాయి. కానీ ఆఫ్ లైన్ లో కేవలం 2వేల టికెట్లను మాత్రమే అమ్మారు. మిగతా టికెట్లు ఏమయ్యాయని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వీటిపై సమాధానం ఇవ్వాల్సిన అజారుద్దీన్ త్వరలోనే ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం మాత్రం ఇవ్వలేదు. రాత్రి ఏడుగంటలకు ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలుంటాయని ప్రకటించి.. తర్వాత మొత్తం టికెట్లు అమ్మేసినట్లు అజార్ ప్రకటన చేశారు. తొక్కిసలాటకు ముందు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం తర్వాత జావకారిపోయారు.