ఏపీ కేబినెట్ మంత్రికి అస్వస్థత – ముంబాయిలో చికిత్స..!!

ఏపీ కేబినెట్ లో సీనియర్ మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం ముంబాయికి తీసుకెళ్లారు. కొంత కాలంగా విశ్వరూప్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో, ముంబాయిలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. విశ్వరూప్ గతంలో వైఎస్సార్ హయాంలో నూ మంత్రిగా పని చేసారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.

కోనసీమ జిల్లా పేరు మార్పుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ నివాసం దహనం చేసారు. ఆ తరువాత వైఎస్సార్ వర్దంతి నాడు జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అదే రోజున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స అందించారు. ఆయన న్యూరో సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఆ తరువాత జిల్లాకు చెందిన పార్టీ నేతలు హైదరాబాద్ లో సిటీ న్యూరో సెంటర్ లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకున్న తరువాత మంత్రి కోలుకున్నారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు.

కోలుకున్నట్లుగా కనిపించిన మంత్రి విశ్వరూప్ తిరిగి.. కొంత అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా.. ఆయనకు గుండె సమస్యలను గుర్తించారు. దీనికి చికిత్స తీసకోవాలని వైద్యులు సూచించారు. దీంతో..ఇప్పుడు ముంబాయికి తీసుకెళ్లారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురికి జగన్ తొలి కేబినెట్ లో అవకాశం దక్కింది. అందులో మంత్రిగా విశ్వరూప్ కు ఛాన్స్ దక్కింది. తిరిగి ఆరు నెలల క్రితం జగన్ తన కేబినెట్ ప్రక్షాళన చేసారు. అందులో భాగంగా.. జిల్లా నుంచి విశ్వరూప్ తిరిగి మంత్రిగా కంటిన్యూ అయ్యారు. అయితే, శాఖ మార్పు జరిగింది. ప్రస్తుతం విశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చికిత్స తరువాత కొంత కాలం విశ్రాంతి అవసరమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.