ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో నరేంద్రమోడీ దారిలో పయనిస్తోన్న జగన్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తోంది. అంతేకాదు.. అవన్నీ ఒకేమాట మీద నిలబడేటట్లుగా చూస్తోంది. నందమూరి తారకరామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేసింది. దీనిపై ఆ పార్టీలోనే కొందరు నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ముందుకే సాగారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ పేరు మార్పుపై పునరాలోచించాలని సీఎంకు లేఖ రాశారు.

తెలుగుదేశం పార్టీ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేరు మారుస్తామని ప్రకటించింది. వైద్యుడిగా, ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్ పేరే సరైందని ఆయన తనయుడు, సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే సభలో ఎమ్మెల్యేలతోపాటు శాసనమండలిలో అన్ని పార్టీలు ఒకతాటిమీదకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన గళం కలిపింది. అలాగే భారతీయ జనతాపార్టీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీతోపాటు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు ఎన్టీఆర్ పేరునే పెట్టాలని డిమాండ్ చేశాయి.

జగన్ కు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో టీడీపీతో బీజేపీ ఎన్నడూ కలవలేదు. అయితే పేరు మార్పు కార్యక్రమాల్లో మాత్రం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. వామపక్షాలు కూడా వీటికి తోడయ్యాయి. ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిన అవసరం ఏమిటనేది వీరు చేస్తున్న ప్రధాన డిమాండ్. అలా అనుకొనివుంటే రాజకీయాలు ఇలా ఉండేవి కావని టీడీపీ స్పష్టం చేస్తోంది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలోని విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరు ఉందని, కానీ మార్చలేదని, హైదరాబాద్ లోని విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉందని, కానీ మార్చలేదని ఉదాహరణగా చూపిస్తోంది.

ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రాన వైసీపీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ విషయం పార్టీకి, జగన్ కు తెలుసు. అయినా ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మాత్రం కారణం.. అవి అమలవుతున్న పద్ధతి అని చెబుతున్నాయి. ఈ విషయంలో మాత్రం ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ అవలంబిస్తున్న విధానాలవల్ల అన్ని పార్టీలు ఒకేవేదికమీదకు వస్తున్నాయని, అదేదారిలో జగన్ కూడా వెళుతున్నారని చెబుతున్నారు.