ఎన్టీఆర్ పేరు మార్పు జూనియర్ ఎన్టీఆర్ స్పందన – ఆ ఇద్దరూ గొప్పనేతలే..!!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం పైన ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమయం నుంచి టీడీపీ నేతలంతా నిరసించారు. ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సభలోనే తనకు ఎన్టీఆర్ పైన ఉన్న గౌరవం గురించి వివరించారు. ఈ నిర్ణయం పైన నందమూరి కుటుంబం స్పందించిది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీ బిల్లును ఆమోదించటం పైన అసహనం వ్యక్తం చేసారు. ఆ నిర్ణయాన్ని ఖండించారు.

ఇదే సమయంలో ఈ నిర్ణయం పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్లు హోరెత్తాయి. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసారు. అందులో..ఎన్టీఆర్ – వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నేతలుగా తారక్ అభివర్ణించారు.

ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టటం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చటం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల మనస్సుల్లో వారి జ్జాపకాలను చెరిపి వేయలేరంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

ఇప్పుడు దీని పైన టీడీపీ శ్రేణులు శాంతిస్తాయా లేక ఇందులో పేర్కొన్న అంశాల పైన ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. గతంలో అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు తన సతీమణి గురించి వైసీపీ నేతలు అనుచితంగా వ్యాఖ్యలు చేసారంటూ సభను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీని పైన నందమూరి కుటుంబం స్పందించి..వైసీపీ నేతలకు హెచ్చరిక చేసింది. ఆ సమయంలో వీడియో సందేశం విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ జరిగిన పరిణామాలను సున్నితంగా తప్పుబట్టారు.

ఆడపడుచులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం పైన సూచనలు చేసారు. కానీ, టీడీపీ నేతలు శాంతించలేదు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడకపోవటం పైన జూనియర్ ఎన్టీఆర్ ను తప్పు బట్టారు. ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఇప్పుడు తాత పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన జూనియర్ స్పందించారు. తన అభిప్రాయం స్పష్టం చేసారు. మరి..ఇప్పుడు ఈ స్పందన పైన టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. తారక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.