ఉబ్బ‌ల‌మ‌డుగులోని అబ్బుర‌ప‌రిచే ప్ర‌కృతి అందాలు..

ఉబ్బ‌ల‌మ‌డుగులోని అబ్బుర‌ప‌రిచే ప్ర‌కృతి అందాలు..

ఉబ్బలమడుగు.. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి పరిచయం అవుతోన్న ఓ సుందర జలపాతం. ఈ అటవీ ప్రాంతంలోని పచ్చని తివాచీలా కనిపించే లోయలు.. వినసొంపైన జలపాతాల సవ్వడులు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తాయి. అక్కడికి కాలినడకన సాగే ప్రయాణంలో వినిపించే పక్షుల కిలకిలారావాలు ఆత్మీయ ఆహ్వానాలు. తడ జలపాతంగా కూడా పిలుచుకునే ఆ ప్రకృతి సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాన్ని చూసొద్దాం పదండి!!

మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా జలపాతాలకు పెట్టింది పేరు. జిల్లాలోని బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల సరిహద్దు ప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం ఉంది. శ్రీకాళహస్తి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకోన అని పిలువబడే అడవిలో ఈ సుందర జలపాతం ఉంది. తిరుపతి నుంచి ఈ జలపాతానికి 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనినే ‘తడ జలపాతం’ అని కూడా పిలుస్తారు. వరదయ్యపాలెం నుంచి ఉబ్బలమడుగుకు రోడ్డు సౌకర్యం ఉంది. అందుకే పర్యాటకులు ఈ మార్గాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు.

         ట్రెక్కింగ్ కు సిద్ధమా?!

ట్రెక్కింగ్ కు సిద్ధమా?!

సిద్ధులకోన పూర్తిగా భయంకరమైన, దట్టమైన అటవీ ప్రాంతం. ఉబ్బలమడుగు జలపాతానికి చేరుకోవాలంటే పది కిలోమీటర్ల వరకూ ట్రెక్కింగ్ చేయాలి. ఆ అటవీ మార్గంలోని పచ్చని ప్రకృతి సోయగాలతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత దూరం ప్రయాణించామో కూడా తెలియకుండా అలసటను దూరం చేస్తుంది. దారిలో ఎదురయ్యే నీటి మీద నిర్మించిన వంతెన ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జలపాతం సవ్వడులు

జలపాతం సవ్వడులు

అలా జలపాతానికి చేరువయ్యేకొలదీ మనకు తెలియకుండానే ఆ నీటి సవ్వడుల అనుభూతులను పొందుతాం. చుట్టూ పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన ప్రకృతి సోయగాల నడుమ కొండకోనలు దాటుకుంటూ వచ్చే జలపాతం దర్శనమిస్తుంది. ఆ జలపాతం చిన్నగా ఉందని కంగారు పడకండి. అక్కడ ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. ప్రధానంగా పిచ్చుకలు. పిచ్చుకలా అని తేలిగ్గా తీసిపారే

యకండి. ఆ పిచ్చుకలు అంత‌రించిపోతున్నాయని మనకు తెలుసు. మనం ఆ పిచ్చుకల కిచకిచలు విని ఎన్నిరోజులు అయివుంటుందో కదా! పైగా ఆ పిచ్చుకలు బొద్దుగా భలే ముద్దోస్తాయి. ఇటీవల మన జనవాసాలలోనూ పిచ్చుకలు అక్కడక్కడా కనిపిస్తున్నా, అవి డైటింగ్ చేస్తున్న పిచ్చుకల్లా ఉంటాయి. ఇక జలపాతం విషయానికి వస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తనివితీరా జ‌ల‌కాలొడుచ్చు. ఈ జలపాతాన్నిసంద‌ర్శించేవారికి ప్రకృతి ఒడిలో సేద దీరిన అనుభూతి కలుగుతుంది. దట్టమైన వృక్షాల మధ్య ప్రవహించే స్వచ్ఛమైన నీరు పరవళ్ళు తొక్కుతూ కనిపించే ఆ సుందర దృశ్యం సందర్శకులను ఆకర్షిస్తుంది.

పురాతన ఆలయం     

పురాతన ఆలయం

ఉబ్బలమడుగు జలపాతం పక్కనే సిద్దేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం పురాతనమైనది. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు ఆలయాన్నిదర్శించుకొని, ఆ తరువాత జలపాతం వద్దకు చేరుకుంటారు. లేదా జల వద్ద సాయంత్రంవరకూ సేదతీరి, ఆ తర్వాత ఆలయానికి వెళతారు. మహాశివరాత్రి రోజు ఉబ్బలమడుగు ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది.

కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకునే స్థానికులు ఇక్కడే టెంట్లు వేసుకొని, వంటావార్పు చేసుకుంటారు. ఆ సమయంలో దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తాయి. ఆ తర్వాత సమయంలో వసతులేవీ కనిపించవు. ఇక్క‌డికి వెళ్లేవారు ఓ రోజుకు సరిపడా ఆహారం, నీరు వెంట తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. తిరుగు ప్రయాణం చీకటి పడక ముందే మొదలుపెట్టడం చాలా ముఖ్యం.

ఎలా చేరుకోవాలి?   

ఎలా చేరుకోవాలి?

ఇక్కడికి చేరుకునేందుకు ముందుగా వరదయ్యపాలెం వెళ్ళాలి. ఈ ప్రాంతానికి దగ్గర ఉన్న రైల్వేస్టేషన్ తడ. అయితే ఇక్కడ అన్ని ట్రైన్లూ ఆగవు. వరదయ్యపాలెం అక్కంపేటకు 11, సూళ్లూరుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఆటోలు లేదా సొంత వాహనాలలో ఉబ్బలమడుగు ఎంట్రెన్స్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడకమార్గంలోనే వెళ్లాలి. తిరుపతి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం.