ఈ ఏడాది చివరకు

శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా తిరుమలలో ఉన్న అన్ని ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనసంతా స్వామివారి కృపతో నింపాలనే ఉద్దేశంతో రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేయబోతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను తితిదే అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈనెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు. తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని కూడా జగన్ ప్రారంభించబోతున్నట్లు సుబ్బారెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఈ సంవత్సరం చివరికి పూర్తి చేస్తామని, 2023 లో వారధి అందుబాటులోకి వస్తుందన్నారు. శ్రీనివాస సేతుతో తిరుపతి వాసులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు నివారించినట్లవుతుందన్నారు. అంతేకాకుండా పూర్తి ప్లాస్టిక్ రహిత తిరుమలగా రూపొందించాలనుకుంటున్నామని, ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చూస్తామన్నారు.