ఆహాలో చెఫ్ మంత్రా సీజన్ 2, హోస్ట్ గా మంచు లక్ష్మీ

సాధారణంగా సెలబ్రిటీస్ జీవితం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. ఫ్రీ టైమ్ లో వాళ్లు ఏం చేస్తారు, ఏం తింటారని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మరి మనం అభిమానించే స్టార్స్ వంటింట్లో చూడముచ్చటగా వంట చేయడంతో పాటూ బోలెడన్ని కబుర్లు మూటగట్టి మనకి ఇస్తానంటే! భలే ఉంటుంది కదూ. అందుకే ఇలాంటి కిక్ ను మనకు అందించేందుకు ఆహా మళ్లీ ఛెఫ్ మంత్రాకు సీజన్ 2కు తెరతీసింది.

8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో కు మంచు వారి అమ్మాయి లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించబోతోందట. నటిగా, దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మంచు లక్ష్మి ఇప్పుడు హోస్ట్ గా అల్లరి చేస్తూ బోలెడన్ని కబుర్లు మూటగట్టుకుని మన ముందుకు వచ్చేస్తోంది. అలాగే, ఈ షో ద్వారా సెలబ్రిటీస్ వంట చేయడమే కాదు, వారు ఎలాంటి ఆహరం ఇష్టపడతారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు అనే విషయాలతో పాటూ వారి డైట్ సీక్రెట్స్ కూడా మనతో పంచుకోబోతున్నారు. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా, మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. లక్ష్మీ మంచు సూపర్ హాట్ గా కనిపిస్తోంది అని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు.

ఇక లక్ష్మీ మంచు ఈ షో గురించి మాట్లాడుతూ మంచు ఫ్యామిలీలో అందరూ భోజన ప్రియులే అని తెలిపారు. తాము కూడా ఎన్నో విషయాలను భోజనం చేస్తూనే మాట్లాడుకుంటామని మంచి ఫుడ్ ఉంటే ఆరోజు చాలా బాగా గడిచిపోతుందని వెల్లడించారు. అలాంటి ఒక ఫుడ్ షో ని తాను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ షోను అందరూ ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి సెప్టెంబర్ 30 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవ్వనున్న ఈ షో ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.